నడక జ్ఞాపకం

నిత్యచలన కవిత్వంతో కలిసి నడిస్తే ఏకంగా పుస్తకాల్లోకి ప్రచలన ప్రయాణమే
కావ్య రహస్యాలు వింటూ మైదానంలో విహరిస్తే ఆ నడకొక సారవంతమయ్యే సారస్వత యానం
సూర్యుని కంటే ముందే మసకలో గమనం అడుగు అడుగులోనూ జీవన సంవేదనల పాఠం
సర్ర సర్ర పోతుంటే మనసొక అల్కటి మేఘం
మహాకవితో నడిస్తే మనసంతా తంగేడు పూల కాంతి
మట్టి జీవితాలను చిత్రిక పట్టే మా సంభాషణం
నాగటి సాళ్లలో అదును మీద అక్షరాలు అలికినట్లు పద్య పాదాలకు సేంద్రియ ఎరువులు వేసినట్లు
ముచ్చట్లన్నీ పచ పచ్చగా ఎదిగే లేలేత లతలు ఒకానొక వేకువ వెలుగురేఖ విచ్చుకున్నప్పుడు
ఇంగ్లండ్‌ నుంచి వర్డ్స్‌ వర్త్‌ దిగ్గున దిగుతాడు గ్రౌండ్‌ నిండా డెఫడిల్స్‌ పూల పరిమళమై
పాద చారులందరికీ ప్రాణవాయువు పరుస్తాడు
మరొక ప్రాతఃకాల వేళ వేల్స్‌ నుంచి డిలాన్‌ థామస్‌ ఉరికొచ్చి అడుగుల్లో అడిగేస్తాడు
ప్రేమా ప్రకతి హదయ రహస్యాలు కుప్ప పోస్తాడు
ఆ తాత్విక భావాల్లోంచి మనసు తేలికై ఉల్లాసపడుతుంది
‘రాజు మరణించె నొక తార రాలిపాయే కవియు మరణించె నొక తార గగనమెక్కె’
విశ్వ కవి జాషువా పద్యాలు విడమర్చి చెప్పిన్నాడు
ఆ రాగయుక్త రాగాలు రోజంతా గుండెల్లో నిలిచె
అక్కన్నే ఓ చెట్టు కొమ్మన గబ్బిలం కనిపించె మరొక ఎర్లీ మార్నింగ్‌ విలియం షేక్స్పియర్‌ను
వెంటపెట్టుకొని స్టాట్‌ ఫర్డ్‌ వీధుల గుండా తిరగాడుతాం
అద్భుతమైన హ్యామ్లెట్‌ నాటకం సజీవంగా పాలిటెక్నిక్‌ మైదానంలో కండ్లకు కడుతుంది
రోజుకోసారైనా వెంటాడే సినారే జ్ఞాపకాలు విశ్వంభరుడు గుర్తుకు రాకుండా నడక కుతి తీరదు
కవిత్వమూ వ్యక్తిత్వమూ కలె గలిసిన తలంపు స్ఫూర్తి పొందటం మహనీయుల అనుభవాల నుంచే
పిల్ల తెమ్మరలు పీలుస్తూ పచార్లు చేస్తుంటే శ్రీ శ్రీ కష్ణశాస్త్రులు తాపతాపకూ మాతోనే
మాటా మాటా కలిపి పాదాల వేగం పెంచుతారు
జీవితం చుట్టూ జలగీతం అల్లుకున్న స్ఫూర్తి నేలను ఆకాశాన్ని ఆలంబన చేస్తున్న చూపు
ప్రతిరోజూ ఒక ఉత్తేజ తరంగ దినోత్సవం మనసునిండా ఆవరించిన కవిత్వ యాత్ర
రామంతపూర్‌లో నెలరోజుల విడిది విరామం విడువలేక తిరిగి ఊరికి చేరుకున్న
సూర్యోదయ సమయాలన్నీ సాహిత్య స్నాతకోత్తర పాఠాలే
కవిత్వం కల్పించిన సోపతికి గురు ప్రణామములు
– అన్నవరం దేవేందర్‌, 9440763479