జీపీ కార్మికుల గోడు

– రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన సమ్మె
– వినూత్న రూపాల్లో నిరసన
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం వినూత్న రూపాల్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. తమ గోడు వినాలని.. వేడుకున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరులో కార్మికులు అంబేద్కర్‌ విగ్రహానికి వినతి అందజేశారు. అశ్వారావుపేటలో 10 సంఖ్య ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. బూర్గంపాడులో బిక్షాటన చేపట్టారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ఖమ్మం రూరల్‌ మండలాల్లో వంటావార్పు నిర్వహించారు.ఆసిఫాబాద్‌లో పచ్చగడ్డి తిని నిరసన తెలిపారు. ఇంద్రవెల్లిలో కార్మికులకు మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ మద్దతు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అంబేద్కర్‌చౌక్‌లో పంచాయతీ కార్మికులు వంటావార్పు చేసుకున్నారు. బాసరలో ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని కార్మికులు కలిసి వినతిపత్రం అందజేశారు. కెరమెరిలో జీపీ కార్మికుల ఒంటికాలుపై నిలబడి నిరసన తెలిపారు.
వికారాబాద్‌ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మెకు సీపీఐ(ఎం), కేవీపీఎస్‌, సీఐటీయూ, రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు మద్దతు తెలిపారు. కార్మికులతో కలిసి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. బొంరాస్‌పేట, దుద్యాల, దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాల కార్మికులు తరలివచ్చారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పర్సాపూర్‌ సర్పంచ్‌ సయ్యద్‌ అంజాద్‌, కొడంగల్‌ మాజీ సర్పంచ్‌ రమేష్‌బాబుకు మెమోరండం అందించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో చేపట్టిన దీక్షలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు పాల్గొని మాట్లాడారు. కందుకూర్‌ మండల కేంద్రంలో జీపీ కార్మికులు వంటావార్పు చేసి నిరసన తెలిపారు.