వార్మప్‌ కుర్రాళ్లకు ఉపయుక్తం

వార్మప్‌ కుర్రాళ్లకు ఉపయుక్తం–  లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌
ముంబయి : బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు ట్రోఫీలో తొలి టెస్టు ముంగిట షెడ్యూల్‌ చేసిన వార్మప్‌ మ్యాచ్‌ను టీమ్‌ ఇండియా రద్దు చేసుకుంది. భారత్‌-ఏతో వార్మప్‌ కంటే.. మ్యాచ్‌ పరిస్థితుల అనుకరణలతో సాధన మేలు చేస్తుందని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ గౌతం గంభీర్‌ భావించారు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారి ఆడనున్న యువ ఆటగాళ్లకు వార్మప్‌ మ్యాచులు మేలు చేస్తాయని లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ అన్నారు. ‘వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో స్వింగ్‌, స్వింగ్‌, స్పిన్‌ పెద్దగా ఉండదు. కానీ రెడ్‌బాల్‌ ఫార్మాట్‌లో ఇవన్నీ అధికంగా ఉంటాయి. బౌలర్ల సహనాన్ని పరీక్షించే లక్షణం బ్యాటర్‌కు ఉండాలి. బౌలర్‌ అలిసిపోయే వరకు ఓపికగా ఉండి ఎదురుదాడి చేయాలి. పుజార, రహానె ఇందులో దిట్ట. అందుకే ఆ ఇద్దరు ప్రస్తుత జట్టు ప్రణాళికల్లో లేరు. ఇప్పుడు జట్టులో వేగంగా ఆడే వారికే ప్రాధాన్యత. వార్మప్‌ మ్యాచ్‌లతో కొత్త బ్యాటర్లకు ఇక్కడి పరిస్థితుల పై మంచి అవగాహన వచ్చేందుకు ఉపయోగ పడుతుంది’ అని సునీల్‌ గవాస్కర్‌ అన్నారు.