– హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అపార్ట్‌మెంట్ సెల్లార్ (స్టిల్ట్ ఫ్లోర్)లో వాచ్‌మెన్ నివాస గదితోపాటు రెండు మరుగుదొడ్లను నిర్మించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2012 భవన నిబంధనల ప్రకారం ఆ విధంగా నిర్మాణం చేసేందుకు వీలుందని గుర్తు చేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించేందుకు చట్టంలో వెసులుబాటు ఉందని తెలిపింది. ఈ మేరకు నిర్మాణాలు చేసేందుకు విధిగా ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాల పార్కింగ్ కోసం నిర్దేశించిన సెల్లార్‌లో వాచ్‌మెన్ ఉండేందుకు గదిని నిర్మించడాన్ని తప్పుపుడుతూ ఈ నెల ఏడున జీహెచ్‌ఎంసీ ఇచ్చిన నోటీసును హైదరాబాద్, మోహన్ నగర్‌లోని సీటీఓ కాలనీలో అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ బిల్డర్ కె రమేష్ హైకోర్టులో సవాల్ చేశారు. ‘500 చదరపు గజాల్లో 15 ఫ్లాట్ల నిర్మాణం జరిగింది. అందులోని వాళ్ల భద్రత నిమిత్తం వాచ్‌మెన్ కోసం సెల్లార్‌లో ఒక గది నిర్మాణం చేశాం. దీనిని కూల్చేయాలంటూ జీహెచ్‌ఎంసీ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలి. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం వాచ్‌మెన్ కోసం గది నిర్మాణం చేయొచ్చు.’అని పిటిషనర్ న్యాయవాది వాదించారు. జీహెచ్‌ఎంసీ నోటీసుకు వివరణ ఇవ్వకుండా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. చట్ట నిబంధనల ప్రకారం వాచ్‌మెన్ గది నిర్మాణానికి కూడా అనుమతి తీసుకోవాలన్నారు. వాదప్రతివాదనల తర్వాత హైకోర్టు నిబంధనల ప్రకారం వాచ్‌మెన్ గది నిర్మాణానికి నిబంధనలు అనుమతిస్తున్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. పిటిషనర్ అనుమతి తీసుకోకుండా వాచ్‌మెన్ గది నిర్మాణం చేశారని తప్పుపట్టింది. జీహెచ్‌ఎంసీ నోటీసుకు పిటిషనర్ ఈనెల 24లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. వాచ్‌మెన్ గది నిర్మాణాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి జీహెచ్‌ఎంసీకి పిటిషనర్ దరఖాస్తు చేసుకోవచ్చనీ, ఆ విధంగా పిటిషనర్ చేస్తే దాని జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకునే వరకు వాచ్‌మెన్ గది విషయంలో కఠిన చర్యలు తీసుకోవద్దని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌కు హైకోర్టులో ఊరట
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అటవీ అధికారుల విధులకు అడ్డంకి కలిగించారనే కేసులో జిల్లా కోర్టు విధించిన శిక్షను శుక్రవారం హైకోర్టు రద్దు చేసింది. అటవీ అధికారుల విధులకు అడ్డంకులు కల్పిస్తున్నారన్న ఫిర్యాదుపై 2006 మార్చి 11న ఆయనపై కేసు నమోదైంది. లక్సెట్టిపేట జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రెండేండ్ల జైలు శిక్ష రూ. మూడు వేల జరిమానా విధించింది. దీనిపై రాథోడ్ అప్పీల్ దాఖలు చేయగా ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆ శిక్షను సవరించింది. రూ.10 వేలు జరిమానాను శిక్షగా విధిస్తూ 2007లో తీర్పు చెప్పింది. దీనిని 2008లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా, రూ.10 వేల జరిమానా శిక్షను రద్దు చేస్తూ జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పు చెప్పారు.
అడిషనల్ పీపీలపై కేసుల విచారణపై స్టే
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) షకీల్, ఎమ్మెల్సీ కవిత తరఫున ఎన్నికల ప్రచారం చేశారంటూ బోధన్ కోర్టులో అడిషనల్ పీపీలపై నమోదు చేసిన క్రిమినల్ కేసు విచారణను హైకోర్టు నిలుపుదల చేసింది. క్రిమినల్ కేసుపై హైకోర్టు స్టే విధించింది.
బోధన్ కోర్టులో అడిషనల్ పీపీలు (టెన్యూర్)గా పనిచేస్తున్న జీ శ్యాంరావు, వీ సమ్మయ్య ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలపై వారిని పదవుల నుంచి ప్రభుత్వం తొలగిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ రాజకీయ పార్టీకి ఎన్నికల ప్రచారం చేశారనే ఫిర్యాదు ఆధారంగా బోధన్ పోలీసులు తమపై అన్యాయంగా క్రిమినల్ కేసు నమోదు చేశారని పిటిషనర్ల వాదన. కేవలం ఎన్నికల్లో ప్రచారం చేశారనే కారణంతో క్రిమినల్ కేసు పెట్టడం చెల్లదని అన్నారు. ఈ మేరకు వారిద్దరూ వేర్వేరుగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై జస్టిస్ కె సుజన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేశారు.
జైలు శిక్ష
కోర్టు ధిక్కార కేసులో డబ్ల్యూ 3 హాస్పిటాలిటీ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ నందు కుమార్‌కు హైకోర్టు నెలరోజులు సాధారణ జైలు, రూ. రెండు వేలు జరిమానా విధించింది. దీనిపై అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ జైలు శిక్ష తీర్పు అమలును నెల రోజులు వాయిదా వేసింది. జరిమానా మాత్రం నాలుగు వారాల్లో చెల్లించాలంది. ఫిల్మ్‌నగర్‌లో డక్కన్ కిచెన్ ఏర్పాటు జాగా లీజుపై నందుకు హీరో దగ్గుబాటి వెంకటేష్, ఆయన సోదరుడు సురేష్ బాబులపై లీగల్ కేసు ఉంది. 2021లో హైకోర్టు ఆ స్థలం విషయంలో స్టేటస్ కో అర్డర్ ఇస్తే దానిని ఉల్లంఘించారని దగ్గుబాటి బ్రదర్స్ కంటెప్ట్ కేసు పెట్టారు. దీనిని విచారించిన హైకోర్టు నందుకు పై విధంగా జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.