కాలం మారినా, నాగరికత ఎంత అభివృద్ధి చెందినా సాంకేతికత మనల్ని చంద్రుని మీద కాలూన్చ గలిగినా ఆడవాళ్ల బతుకు ఇంకా అరటి ఆకే!
ఏపుగా పెరిగి నిండుగా కాయలున్న గున్నమామిడి చెట్టుకు రక్షణ కంచె వుండాలి. లేకపోతే ఆకతాయిలు, దారెంట వెళ్లే వారు రాళ్లేసి కాయలు రాల్చుకుంటారు. కొమ్మలు విరిచేసి రాక్షసానందం పొందుతారు.
ఇదే విషయాన్ని, ప్రపంచ నైజాన్ని, కఠోర సత్యాన్ని రచయిత శొంఠి జయప్రకాష్ తన ‘ఆకుల నరసమ్మ’ నవలలలో వివరిస్తారు. బ్యాంకు ఉద్యోగిగా, తన చుట్టూ చోటు చేసుకుంటున్న సమాజ పోకడలను ఒక మౌన ప్రేక్షకుడిగా గమనిస్తూ వాటిని తన రచనల్లోకి వంపుకుంటూ, అర్ధవంతమైన సమాజం ప్రస్తుతం కావాలన్న అభ్యుదయకామనతో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.
రెండు భాగాలుగా, రెండు వందల పాతిక పేజీలుగా, రెండు పాతికల దేశ పరిణామాల్ని చూసిన, ఒకే అర్ధం వచ్చే రెండు పదాల సమ్మేళనంగా ఆ ఊరు ‘నాగలి సుడక’లో ఈ కథ మొదలవుతుంది. 50 ఏళ్లకే వందేళ్ల అనుభవం గడించి ఆ వూరు కొండలా నిశ్చలంగా నిలిచిన పండుటాకు లాంటి ఆకులు అమ్ముకునే నరసమ్మ అనే ధీరోదాత్త దళిత మహిళ కథే ఈ నవల.
నాలుగేళ్ల పసిప్రాయంలోనే అనాథగా తిరునాళ్లలో వదిలిపెట్టబడితే, జోగప్ప అనే దళిత కులస్తుడు, ఆమెను పెంచుకుంటాడు. జోగప్ప ఆ ఊరి పెద్ద కమతం దారు. చాతుర్వర్ణం అనే నిచ్చెన మెట్ల సమాజంలో నాలుగో మెట్టుకి చెందినవాడు. ఉన్నతాశయాలు, లోకజ్ఞత కలిగినవాడు. తన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలవాడు.
జోగప్ప ప్రాపున పెరిగిన నరసమ్మ పదారేళ్ల ప్రాయానికి వస్తుంది. వయసు, వయసుతో పాటు వచ్చిన ప్రాయంతో నాగలి సుడక ఊరికే అందగత్తె అవుతుంది. ఎందరో నరసమ్మ మీద కన్ను వేసినా, బలమైన రక్షణ కంచెలాంటి జోగప్పకు వెరిసి దూరంగా వుంటారు.
జోగప్ప తన మేనల్లుడైన ఏటప్పకిచ్చి నరసమ్మ పెళ్లి జరిపిస్తాడు. ఏటప్ప పుట్టు అవిటివాడు అవటంతో నరసమ్మలో ఏహ్యత కలుగుతుంది. దీనికి తోడు నరసమ్మను రక్షించే క్రమంలో ఒక పోట్లాటలో గాయపడి వెన్నెముకకు దెబ్బతగిలి సంసారానికి రాకుండా అవుతాడు.
ప్రాయానికి వచ్చిన నరసమ్మ శారీరక సుఖం కోసం వెంపర్లాడుతుంది. ఆత్మ న్యూనతకు లోనైన ఏటప్ప నరసమ్మ ఛాయలకు కూడా చేరటానికి జంకుతుంటాడు. భర్త వల్ల దొరకని సుఖం ఆమె నాగేశ్వర్ అనే ఆకతాయి, అబద్దాల కోరులో వెదుక్కుంటుంది. ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలున్న నాగేశ్వర్ నరసమ్మకు అరచేత స్వర్గం చూపుతాడు.
పతనం మొదలయిందంటే అధ:పాతాళానికి కూరుకుపోవటానికి ఒక్క క్షణం చాలు. తిరిగి కోలుకోలేనంతగా నడ్డి విరిగి కూలబడటానికి. సరిగ్గా నరసమ్మ జీవితం ఇలాంటి మలుపే తిరిగింది. భూతల స్వర్గం లాంటి జోగప్ప తోట నుండి భూతాల కోటలాంటి నాగేశ్వర్ పాలబడింది.
వెనుదిరిగి వెళ్లలేక శిథిలమైన తన జీవితాన్ని వీలైనంత మేర లాక్కురావాలని ధైర్యం చిక్కబట్టుకుంది.
ఆమె ఇప్పుడు ‘ఆకుల నరసమ్మ’ అయి ఊరి ప్రయివేటు బస్టాండ్‌లో పెద్ద వేపచెట్టు నీడన తమలపాకుల బుట్టతో తనను, నాగేశ్వర్‌ను వారి కుటుంబానికి ఆసరా అయి నిలదొక్కుకుంటుంది. తనలాంటి విధి వంచితులకు ఆమే ఆసరా అవుతుంది.
కొన్నాళ్లకు ఏటప్ప ఆమెకు తారసపడుతాడు. జోగప్ప మరణానంతరం ఆయన ఎస్టేట్‌కు తిరిగి వచ్చిన నరసమ్మ, ఏటప్పలు నిర్వహిస్తూ అనాథ శిశువులకు, మహిళలకు ఆసరా అవుతారు.
రచయిత కథ నడిపించిన తీరు, సంఘటనల పేర్పు, నరసమ్మ పతనోద్దానాలు, తిరిగి ఆమె అనాథ సేవకు అంకితమైన విధాయకం పాఠకులను మంత్రముగ్ధులను చేస్తుంది. చివరిదాకా విడవక చదివించే ఉత్కంఠ కలిగించడంలో రచయిత శొంఠి జయప్రకాష్ వందశాతం కృతకృత్యుడయ్యాడు.
దళితుల్లోనే ఎన్నో తెగలు, ఉపతెగలుంటాయని వాళ్లు పరస్పరం ద్వేషించుకుంటాని తెలుస్తుంది. ఈ తెగల పెద్దలు తమ స్వార్థపూరిత కుటిలత్వంతో వాళ్లలో వాళ్లకు వైషమ్యాలను ఎగదోస్తుంటారని తెలుసుకుంటాం. జోగప్పలాంటి పూలవనంలో పనిమనిషి గోవిందు లాంటి విషప్పురుగులు, ఏటప్పలాంటి గంగి గోవులంటాయని తెలుస్తుంది. తోళ్లను పదును పెట్టే విధాయకం, చిన్న ఊళ్లో పరస్పరాధీనతలు, అన్ని కులాల మధ్య ఉండాల్సిన సామరస్యం విలువ తెలియజేస్తుంది. ఎక్కడా పద పటాటోపాలు, సూర్యోదయ సూర్యాస్తమయ వర్ణనలు లేకుండా సాదాసీదాగా నవల నడుస్తుంది. క్షణికోద్రేకంలో వేసే తప్పటడుగులు తప్ప, ఉన్నతుల మధ్య పెరిగే వారి ఆలోచనలు ఉన్నతంగానే వుంటాయని నిరూపిస్తుందీ నవల.
‘పుట్టినప్పుడు మనిషికి మతం, కులం, జాతి గురించి తెలియదు. పెరిగి పెద్దయ్యాక సమాజం వాటిని నేర్పిస్తుంది’
‘చెడు ఎప్పుడూ మనిషిని తన వైపు లాగాలని ప్రయత్నిస్తూ వుంటుంది’
‘సర్వ సంపదలు పోగొట్టుకున్నా, ఈ లోకం పగబట్టి కత్తి గట్టినా మనిషి పోగొట్టుకోకూడనిది ధైర్యం’ లాంటి మంచి వాక్యాలు ప్రతీకాత్మకతలు నవల నిండా కనిపిస్తూ, పాఠకుడిని ఒక అన్ డిఫైన్డ్ భావనాలోకానికి తీసుకువెళ్తుంది. ఒక మంచి నవల చదివామన్న సంతృప్తిని పాఠకులకు కలిగిస్తుంది.
– కూర చిదంబరం, 8639338675