అన్సారీ మృతికి వారం ముందే…

అన్సారీ మృతికి వారం ముందే...– నివేదిక కోరిన ప్రత్యేక కోర్టు
– జైలు అధికారులకూ ఆదేశాలు
– విషప్రయోగంపై తన పిటిషన్‌లో అన్సారీ తీవ్ర ఆరోపణలు
– వైద్య చికిత్స, సౌకర్యాలు, భద్రత కల్పించాలన్న న్యాయస్థానం
– పట్టించుకోని జైలు అధికారులు
– యోగి సర్కారు తీరుపై రాజకీయ నాయకుల ఆగ్రహం
లక్నో : యూపీలో దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్‌ అన్సారీ అనుమానాస్పద మృతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆయన గుండెపోటుతో చనిపోయినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే, ముఖ్తార్‌ అన్సారీ మృతిపై ఆయన కుటుంబీకులు కూడా అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరి ఆ తర్వాత గుండెపోటుతో ఆయన చనిపోవటానికి వారం ముందే యూపీలోని ఒక కోర్టు ఆయనపై విష ప్రయోగం జరిగిందన్న ఆరోపణలపై బాండాలోని జైలు అధికారుల నుంచి ఒక నివేదికను కోరింది. 40 రోజుల వ్యవధిలో రెండు సందర్భాల్లో తన ఆహారంలో విషం కలిపారని ముఖ్తార్‌ అన్సారీ ఆరోపించారు. ఈ ఆరోపణల పైనే న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.
ఈ విషయంలో అన్సారీ ఈ నెల 21న న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై బారాబంకి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక జడ్జి కమల్‌ కాంత్‌ శ్రీవాస్తవ వాదనలు విన్నారు. విష ప్రయోగం జరిగిందన్న ఆరోపణల విషయంలో అన్సారీ ఆరోగ్యం, భద్రత గురించి ఒక నివేదిక సమర్పించాలని జైలు సూపరింటెండెంట్‌ను ప్రత్యేక జడ్జి ఆదేశించారు. మార్చి 29 లోగా దానిని సమర్పించాలని తెలిపినట్టు ఆర్డర్‌ కాపీలో ఉన్నది. అయితే, ఈ లోగానే అన్సారీ చనిపోవటం గమనార్హం.మార్చి 19న జైలులో తనకు అందించిన ఆహారంలో విష ప్రయోగం జరిగిందనీ, దాని కారణంగానే తాను అనారోగ్యానికి గురయ్యానని తన అప్లికేషన్‌లో అన్సారీ పేర్కొన్నాడు. ఈ ఘటనకు దాదాపు 40 రోజుల ముందు తన ఆహారంలో స్లో పాయిజన్‌ కలిపారని కూడా అన్సారీ ఆరోపించాడు. ఈ మొత్తం తతంగంపై, తనకు అందిన మొత్తం చికిత్స విషయంలో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలనీ, తన భద్రత కోసం తగిన ఆదేశాలనూ జారీ చేయాలని కోర్టును ఆ సమయంలో అన్సారీ కోరాడు. జైలులో తన జీవితానికి ముప్పు పెరిగిందనీ, తనకు ఏ సమయంలోనైనా ఏదైనా జరగొచ్చని కూడా ఆయన ఆరోపించాడు. తనకు జరిగిన విషప్రయోగం ‘పెద్ద కుట్రలో’ భాగమని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఈ విధంగా అప్లికేషన్‌లో అన్సారీ చేసిన తీవ్ర ఆరోపణలపై స్పందించిన జడ్జి శ్రీవాస్తవ.. అన్సారీకి తగిన, సరైన వైద్య పరీక్షలు, సౌకర్యాలు అందించాలంటూ బాందా జిల్లా జైలు సూపరింటెండెంట్‌కు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు జైలు మ్యాన్యువల్‌ను బట్టి తెలుస్తున్నది.
జైలులో తన తండ్రిని చంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్సారీ కుమారుడు ఉమర్‌ అన్సారీ సైతం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇవే ఆరోపణలను పునరుద్ఘాటించారు. కాగా, అన్సారీ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. విషప్రయోగంపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవటం ఖండించదగినదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో యూపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యోగి ప్రభుత్వం అన్సారీని టార్గెట్‌గా చేసుకుంటూ వచ్చిందనీ, ఇప్పుడు అన్సారీ ఈ స్థితిలో హటాత్తుగా మరణించటం అనేక అనుమానాలను కలిగిస్తున్నదని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.