నీటి నిల్వలపై శ్వేతపత్రం ఇవ్వాలి

On water reserves A white paper should be given– సాగునీటిని తక్షణమే విడుదల చేయండి : సీఎం రేవంత్‌కు సీపీఐ (ఎం) లేఖ
– కాళేశ్వరంపై సూచనలు స్వీకరించి, అఖిలపక్షం ముందుంచాలని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రస్తుతం పంటలెండిపోతున్నాయని సీపీఐ (ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. వారిని తక్షణం ఆదుకునేందుకు వీలుగా శ్రీరాం సాగర్‌, మానేరు, మల్లన్న సాగర్‌ తదితర జలాశయాల్లోని నీటి నిల్వలకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా సాగునీటి విడుదలకు ఉన్న అవకాశాలను స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేసింది. నీటిని విడుదల చేయటం ద్వారా కాపాడగలిగిన మేరకు పంటలను కాపాడాలని సూచించింది. మిగిలిన వాటికి నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, జి.నాగయ్య, టి.సాగర్‌… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. సోమవారం తమ పార్టీ ఆధ్వర్యంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించామని వారు లేఖలో పేర్కొన్నారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు రోజురోజుకూ మరింత కుంగుతున్నాయని తెలిపారు. వర్షాలు పడితే అవి మరింత వేగంగా కుంగిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడిన చోట తాత్కాలికంగా పూడ్చినప్పటికీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. దీనిపై న్యాయవిచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రయివేటు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కయిన ఫలితంగానే ఇలాంటి పరిణామాలు సంభవించాయని తెలిపారు. కాళేశ్వరం పేరుతో రీడిజైన్‌ చేసిన ప్రాజెక్టు భవిష్యత్‌ గురించి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనలు, ఇతర నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాటిని అఖిలపక్షం ముందుంచాలంటూ కోరారు. గత ప్రభుత్వం సకాలంలో వ్యవసాయ ప్రణాళికను రూపొందించకపోవటంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు కూడా కంటింజెన్సీ ప్రణాళికను రూపొందించకపోవటంతో సమస్య మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. ఫలితంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వయంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు రేవంత్‌రెడ్డిని కోరారు.