మేడారం జాతర అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

– తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం  జిల్లా కమిటీ డిమాండ్
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం జాతర అభివృద్ధి పనుల పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి అన్నారు.మంగళవారం గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.  ఇటీవలే జరిగిన మేడారం జాతరపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి మాట్లాడుతూ మేడారం జాతర వచ్చిన భక్తులకు సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులకు గురి అయ్యారని, మేడారం జాతరకు భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం 105 కోట్ల రూపాయలు విడుదల చేయగా మేడారం జాతర లో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగా వున్నాయని, 105 కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడ జరిగిందని చెప్పాలని, మేడారం జాతర పై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనీ  డిమాండ్ చేశారు. జాతర అనంతరం చుట్టుప్రక్కల గ్రామాలకు అనేక ఇబ్బందులు, రోగాలు రాకుండా పారిశుద్య పనులు త్వరతిగతిన చేపట్టాలని అధికారులను కోరారు. నిత్యం మేడారం లో అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల కొరకు 100 పడకల హాస్పిటల్ నిర్మించి శాశ్వత పరిస్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీ సభ్యులు వంకా రాములు, జెజ్జరీ దామోదర్, ఊకె ప్రభాకర్, అలెం అశోక్, కుర్సం ప్రవీణ్, తోలేం కృష్ణయ్య, ఇర్ప శ్రీనివాస్,కోటే కృష్ణారావు, చందా లక్ష్మి నారాయణ, పూనెం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.