జాతీయస్థాయిలో మెరిసిన ‘అడవి’ ముత్యం

A 'wild' pearl that shines nationallyఇదే శీర్షికలో మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం! మన పిల్లలు కవులుగా, రచయితలుగా, వ్యాసకర్తలు, బాల సాహితీవేత్తలుగా చక్కగా వెలుగుతున్నారు… రాణిస్తున్నారు. బడిలో పాఠంగా కథలు చదువుకునే పిల్లలు తామే రచయితలుగా మారి కథలు రాస్తున్నారు. టీచర్‌ చెప్పిన కవితలను, గేయాలను, పద్యాలను చదివి తామే కవులుగా వాటన్నిటిని రాసి పుస్తకాలుగా అచ్చు వేయిస్తున్నారు. ఈ ముచ్చట గురించి మన గరిపెల్లి అశోకన్నను అడిగితే ఆ లిస్టు చాంతాడంత పొడవు. నిజం… మన పిల్లలు ఇవ్వాళ వాళ్లకు ఏం కావాలో వాళ్లే దానిని రాసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఒక అస్తిత్వ ఉద్యమమే మరి! అలా తమకోసం తాము రాసుకుంటున్న వందలాది మంది చిన్నారుల్లో రచయిత్రిగా కేంద్ర ప్రభుత్వ సి.సి.ఆర్‌.టి. ఉపకార వేతనాన్ని అందుకున్న తెలుగు బాలిక చిరంజీవి గీస శ్రీజ ఒకరు.
శ్రీజది ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌ మండలంలోని కూర గ్రామం. ఇది మహారాష్ట్ర సరిహద్దులో, పెన్‌గంగకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీజ 14 మార్చి, 2008 న పుట్టింది. తల్లితండ్రులు గీస కళావతి – వెంకన్నలు. శ్రీజ ప్రస్తుతం పాలిటెక్నిక్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లమా చదువుతోంది.
బడిలో విద్యార్థిగా ఉన్న శ్రీజ తమ బడికి కొత్తగా వచ్చిన పెద్దసారు పోరెడ్డి అశోక్‌ ప్రభావంతో కథలు రాయడం మొదలు పెట్టింది. తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే ఏకంగా తన తొలి పుస్తకాన్ని అచ్చువేసుకుని ఆవిష్కరణ పండుగ జరుపుకుంది. శ్రీజ బడి అడవి జిల్లా ఆదిలాబాద్‌ జిల్లాలోనిది. చుట్టూతా అపారమైన వన సంపద, అందులోని జంతువులు, అక్కడి కల్మషమెరుగని మనుషులు ఆమెను రచయిత్రిని చేశాయని చొప్పొచ్చు. ఆరవ తరగతిలో చిన్న చిన్న జంతువుల పాత్రలతో పెద్దసారు ప్రోత్సాహంతో కథలు రాయడం మొదలుపెట్టింది. అందుకు ఆమెకు వాళ్ల బడి గ్రంథాలయం కూడా తోడైంది. ఈమెది వ్యవసాయ కుటుంబం కావడంతో తన కథల్లో అవి అంతటా మనకు కనిపిస్తాయి. కాబట్టే తాను రోజూ చూసే కుక్క, పిల్లి, మేక, జింకలతో పాటు వాళ్ల అడవిలో ఉండే నక్క, పులి ఆమె కథల్లోకి వస్తువులుగా వచ్చి చేరాయి. అంతలోనే కోవిడ్‌ రావడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో పిల్లలు కథలకు, బడికి దూరం కావద్దన్న సంకల్పంతో పోరెడ్డి అశోక్‌ మొదలుపెట్టిన జూమ్‌ అవగాహనా కార్యక్రమంలో డా.వి.ఆర్‌. శర్మ అనే మరో తుఫాను పిల్లలను ముంచెత్తి వాళ్లను పక్కా రచయితలుగా మార్చింది. అనేక పోటీల్లో శ్రీజ బహుమతులు గెలుచుకుంది, పురస్కారాలు అందుకుంది. తెలంగాణ టీచర్స్‌ ఫెడరేషన్‌ పెట్టిన కథల పోటీకి ‘వలస కూలీలు’ కథ రాసి పంపగా అది రెండువేల రూపాయలు గెలుచుకుంది. జాతీయ స్థాయిలో విద్యాశాఖ వారి ‘యంగ్‌ అచీవర్స్‌’ అవార్డుకు ఎంపికైంది. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా డెబ్బై మంది బాలికలను ఎంపిక చేసి యంగ్‌ అచివర్స్‌గా గుర్తించింది. తానా సమావేశంలో పాల్గొంది. తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించిన బాల సాహిత్య సదస్సులోనూ పాల్గొంది. 2023లో బాల సాహిత్య రచనా విభాగంలో ముస్తాబాద్‌కు చెందిన డా.చింతోజు బ్రహ్మయ్య-బాలమణి బాల సాహిత్య పురస్కారం కింద ఎంపికై వేయి రూపాయల నగదు పురస్కారం అందుకుంది.
బడిలో ప్రారంభమైన శ్రీజ రచనలు కోవిడ్‌ తర్వాత మళ్లీ బడి తెరిచే సమయానికి ఒక పుస్తకానికి కావల్సినన్ని తయారయ్యాయి. వాటిని వాళ్ల అశోక్‌ సారే ‘శ్రీజ కథలు’ పేరుతో ప్రచురించాడు. ఇందులోని కథలన్నీ మనకు ఆదిలాబాద్‌ అడవిని, అక్కడి జంతువులను, జీవితాలను చూపిస్తాయి. సాధారణంగా పెద్దవాళ్లే పిల్లలను కాపాడడం వంటివి మనం చదువుతుంటాం. కానీ శ్రీజ కథ ‘పిల్ల ఏనుగు తెలివి’ వేరేగా ఉంది. ఒక అడవిలో ప్రమాదం జరిగినప్పుడు పిల్ల ఏనుగు సలహాతో ఎలా ప్రమాదాన్ని అధిగమించారో ఇందులో మనం చూడవచ్చు. పిల్లలను హీరోలుగా చిత్రించి రాయడం గొప్ప విషయం, నేటి తరానికి మనం వీటిని అందిస్తే స్ఫూర్తివంతమైన వారసత్వం అందుతుంది కదా! అందరం కలిసివుండి స్వార్థాన్ని వదిలివేస్తే విజయాలు ఎలా సొంతం అవుతాయో ‘ఎలుక- ఒంటె కథ’లో చూడవచ్చు. ఈర్ష అసూయల వల్ల కలిగే నష్టాన్ని ‘పాము-పిల్లి కథ’లో వివరిస్తుంది. శ్రీజ ఆదిలాబాద్‌ అడవిమల్లె కదా! జంతువుల గురించి, వాటి ప్రవర్తనల గురించి బాగా తెలుసు. దానిని ‘ఎలుక సాయం’ కథలో వివరిస్తుంది. జంతువులు కేవలం వాటి ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే ఇండ్లలోకి వస్తాయని, వేరే ఏ స్వార్థంకానీ, మనుషులకు హాని చేయాలన్న ఆలోచనగానీ ఉండవని చెబుతుంది. బలమైన శత్రువు ఎదరు పడ్డప్పుడు చిన్న చిన్న ప్రాణులు ఏకమైతే ఎలా ఉంటుందో తెలిపే కథ ‘కలిసుందాం’ కథ. కేవలం జంతువుల కథలే కాదు తన చుట్టూ ఉండే మనుషులను గురించి కూడా రాసింది శ్రీజ… ‘రంగయ్య-రామయ్య’ కథ అదే. ఇందులో తాను చూస్తున్న సమాజపు ఆర్థిక స్థితిని, మానవ సంబంధాలను చిత్రించిందీ చిన్నారి రచయిత్రి. శ్రీజ కథల్లోని ఆదర్శ ఉపాధ్యాయుని కథ ‘కథల పుస్తకం’. చక్కని కథలను తమ కోసం రాసుకున్న శ్రీజ ఎదుగుతున్న రేపటి మన తరం ప్రతినిధి. మన పిల్లల ఆలోచనలు, ఆశయాలకు అక్షర నిదర్శనం. చదువుతో పాటు రచనను చేపట్టి సుసంపన్నం చేస్తున్న ఈ ఆదిలాబాద్‌ అడవిమల్లెకు అభినందనలు.. ఆశీస్సులు! స్ఫూరిగా నిలిచిన పోరెడ్డి అశోక్‌ గారికి దిల్‌సే ముబారక్‌బాద్‌!
డా|| పత్తిపాక మోహన్‌
9966229548