ఆసీస్‌కు ఓ విజయం

A win for the Aussies– శ్రీలంకపై 5 వికెట్లతో గెలుపు
– రాణించిన జంపా, కమిన్స్‌
– ఐసీసీ 2023 ప్రపంచకప్‌
నవతెలంగాణ-లక్నో
ఐసీసీ 2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. సోమవారం లక్నోలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్‌ హ్యాట్రిక్‌ పరాజయం నుంచి తప్పించుకోగా.. లంకేయులకు ముచ్చటగా మూడో ఓటమి తప్పలేదు. 210 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (52, 51 బంతుల్లో 9 ఫోర్లు), జోశ్‌ ఇంగ్లిశ్‌ (58, 59 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్నస్‌ లబుషేన్‌ (40, 60 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 209 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు నిశాంక (61, 67 బంతుల్లో 8 ఫోర్లు), కుశాల్‌ పెరీరా (78, 82 బంతుల్లో 12 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరిసినా.. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 52 పరుగులకే చివరి 9 వికెట్లు చేజార్చుకున్న శ్రీలంక భారీ మూల్యం చెల్లించుకుంది. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం కాగా, శ్రీలంకకు ఇది మూడో ఓటమి.
శ్రీలంక టపటపా : తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఓపెనర్ల దూకుడుతో భారీ స్కోరు దిశగా సాగింది. పెరీరా (78), నిశాంక (61) తొలి వికెట్‌ కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఫామ్‌లో ఉన్న కుశాల్‌ మెండిస్‌ (9), సదీర సమరవిక్రమ (8) నిరాశపరచటంతో శ్రీలం క కథ అడ్డం తిరిగింది. ఆసీస్‌ స్పిన్నర్‌ జంపా వలలో చిక్కుకున్న మిడిల్‌ ఆర్డర్‌.. పేకమేడలా కుప్పకూలింది. చివరి 9 వికెట్లను లంకేయులు 52 పరుగులకే కోల్పోయారు. 43.3 ఓవర్లలోనే ఆలౌట్‌ అయ్యారు. మిడిల్‌ ఆర్డర్‌లో అసలంక (25) ఒక్కడే రెండెంకల స్కోరు అందుకున్నాడు. కమిన్స్‌, స్టార్క్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. జంపా (4/47) నాలుగు వికెట్లతో మాయ చేశాడు.
ఆడుతూ పాడుతూ : స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ అలవోకగా ఛేదించింది. డెవిడ్‌ వార్నర్‌ (11), స్టీవ్‌ స్మిత్‌ (0) నిరాశపరిచినా.. మిచెల్‌ మార్ష్‌ (52), జోశ్‌ ఇంగ్లిశ్‌ (58), లబుషేన్‌ (40), మాక్స్‌వెల్‌ (31 నాటౌట్‌, 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్కస్‌ స్టోయినిస్‌ (20 నాటౌట్‌, 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరవటంతో 35.2 ఓవర్లలోనే ఆసీస్‌ లాంఛనం ముగించింది. శ్రీలంక బౌలర్లలో మధుశంక (3/38) రాణించాడు.