డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ గర్భంలోని శిశువు మృతి..

– డాక్టర్లు, సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి..
నవతెలంగాణ – వేములవాడ
ప్రసూతి కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ గర్భంలోని శిశువు మరణించిన సంఘటన వేములవాడలో చోటుచేసుకుంది. బోయినపల్లి మండలం జగ్గారావుపెల్లి కి చెందిన తిప్పరవేని చందు- అమూల్యలకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా, తొలి కాన్పు సమయం కావడంతో వేములవాడ ఏరియా హాస్పిటల్ మూడు రోజుల క్రితం అడ్మిట్ కాగా, ఆపరేషన్ చేయాలని అమూల్య బంధువులు ఎంత వేడుకున్నా డాక్టర్లు మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఆపరేషన్ చేయాలంటే అనస్తీషియా డాక్టర్ అందుబాటులో లేడని, ఆపరేషన్ చేసే డాక్టర్ లేడని పొంతనలేని సమాధానాలు సమాధానాలు చెప్పారని బాధితులు వాపోతున్నారు. అప్పటికే తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న అమూల్య గర్భంలోని శిశువు మరణించాడు. వెంటనే తేరుకున్న డాక్టర్లు ఆదరాబాదరగా ఆమెకు ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును అప్పగించడంతో ఆగ్రహం తో కుటుంబ సభ్యులు ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పసి పాప మృతి చెందినదని, బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్య సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండటం లేదని పేషెంట్లు మొరపెట్టుకున్న దావకానలో స్పందించే సిబ్బంది లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు.