అద్భుతమైన అనుభూతినిచ్చే గామి

విశ్వక్‌ సేన్‌ నటించిన తాజా సినిమా ‘గామి’. విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో కార్తీక్‌ కుల్ట్‌ క్రియేషన్స్‌పై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్‌ ఫండ్‌ చేశారు. వి సెల్యులాయిడ్‌ ప్రజెంట్‌ చేస్తోంది. ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ చాందినీ చౌదరి మీడియాతో ముచ్చటించారు. ”గామి’ అంటే సీకర్‌.. తాను అనుకున్న గమ్యాన్ని గమించేవాడు గామి. వారణాసి, కుంభమేళ, కాశ్మీర్‌, హిమాళయాలు.. ఇలా రియల్‌ లోకేషన్స్‌లో ఈ సినిమాని అద్భుతంగా చిత్రీకరీంచాం. మా టీంలో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. చిత్రీకరణలో చాలా సవాల్‌తో కూడిన పరిస్థితులు ఉండేవి. ఇందులో చూపించిన స్టంట్స్‌ రియల్‌గా చేశాం. ఈ సినిమా ప్రయాణం అంతా ఒక సాహస యాత్రలా జరిగింది. కొన్ని కథలు విన్నప్పుడు నన్ను నేను నియత్రించుకోలేను. ‘గామి’ కథ విన్నప్పుడు కూడా ఖచ్చితంగా అందులో భాగం కావాలనిపించింది. నా మనసుకి చాలా తప్తిని ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకి చాలా సమయం పడుతుందని తెలుసు. ఎందుకంటే చెప్పే కథ పెద్ద కాన్వాస్‌లో ఉంది. చాలా డిఫరెంట్‌ వాతావరణ పరిస్థితుల్లో తీసిన సినిమా ఇది. అందుకే విజువల్స్‌ ఇంత అద్భుతంగా వచ్చాయి. ఐమాక్స్‌ స్క్రీన్‌లో ట్రైలర్‌ చూసినప్పుడు పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందని ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. ఇందులో నాది, విశ్వక్‌ పాత్రల కథలు ఒకదానితో ఒకటి మెర్జ్‌ అయ్యి ఉంటాయి. ఎలా మర్జ్‌ అవుతాయనే తెరపై చూడాలి. గామి క్లైమాక్స్‌ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. ఈ సినిమా వర్క్‌ అవుట్‌ అయితే ఇంలాంటి మరిన్ని అద్భుతమైన కథలు వస్తాయి. ఈ ఏడాది నేను నటించిన నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. ఓ నటిగా నేను అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను.