చిరంజీవి నటిస్తున్న మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానున్న నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన డడ్లీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘ఇది నా తొలి తెలుగు సినిమా. దర్శకుడు మెహర్ రమేష్, నేను పదేళ్ళుగా మంచి స్నేహితులం. లాక్ డౌన్ పీరియడ్‌లో ఓ రోజు కాల్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పారు. హీరో ఎవరని అడిగాను. గెస్ చేయమని చెప్పారు. నేను ఏవో రెండు పేర్లు చెప్పాను. ‘మెగాస్టార్ చిరంజీవి గారు’ అని ఆయనే రివీల్ చేశారు. నాకు చాలా షాక్ అండ్ సర్ప్రైజ్‌గా అనిపించింది. చాలా థ్రిల్ అయ్యాను. వెంటనే ముంబై నుంచి వచ్చి మిగతా వాటి గురించి చర్చించాం. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది. చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. పర్‌ఫెక్షనిస్ట్. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఇది ‘వేదాళం’ చిత్రానికి రీమేక్. చిరంజీవితో చర్చించి సమిష్టిగా మార్పుల విషయంలో నిర్ణయాలు తీసుకున్నాం. ఇది మెగాస్టార్ స్టయిల్‌లో ఉంటుంది. లుక్, టేకింగ్ పరంగా మెగాస్టార్ స్టయిల్‌కి తగట్టు మార్పులు చేశాం. ఒరిజినల్ కంటే బెటర్‌గా ఉంటుంది. ఒక డీవోపీగా రీమేక్ సినిమా చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఒరిజినల్‌ని మ్యాచ్ చేస్తే సరిపోదు దాని కంటే ప్రతి విషయంలోను ఒక అడుగు బెటర్‌గా ఉండాలి. ఇది బిగ్ ఛాలెంజ్. అందుకే ఈ సినిమా విజువల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. దీనికోసం చాలా పెద్ద సెట్స్ వేశాం. సినిమా అంతా గ్రాండ్‌గా విజువల్ ట్రీట్‌గా వుంటుంది. ఇందులో యాక్షన్ పార్ట్‌కి కాంటాక్ట్ కెమెరాని వాడాం. కలకత్తా, స్విట్జర్లాండ్‌లో కూడా చిత్రీకరణ జరిపాం. యాక్షన్, సాంగ్స్ చాలా బావుంటాయి. భోళా శంకర్ ఫుల్ ప్యాకేజీ ఆఫ్ మాస్ ఎంటర్ టైనర్. కన్నుల పండగలా ఉంటుంది. ఈ సినిమా జర్నీ చాలా సరదాగా జరిగింది’ అని తెలిపారు.