ఆకలి కేకల ప్రపంచం

A world of hunger pangsదేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని చెప్పే పాలకులకు పేదల ఆకలికేకలు కనిపించవు. ఆర్తనాదాలు వినిపించవు. ఎవరికి వారు తమది పేద దేశం కాదని, ప్రపంచంలోనే ధనిక దేశాలతో పోటీపడుతున్నామని చెబుతున్నవారి డొల్లతనాన్ని తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 731 నుంచి 757 మిలియన్ల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ప్రతి 11 మందిలో ఒక్కరు ఆకలి వలయంలో చిక్కి బక్కపడుతున్నారని పేర్కొంది. ఐరాస ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ విడుదల చేసిన ”స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రిషన్‌ ఇన్‌ ది వరల్డ్‌ 2024 (ఎస్‌ఓఎఫ్‌ఐ-2024)” నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం చూస్తే ఆహార అభద్రత, పోషకాహార లోపాలు ప్రపంచ మానవాళిని వెంటాడుతున్నాయి. ఆసియా ఖండంలోనే అత్యధిక పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజలున్నారు. 2023లో దాదాపు 2.33 బిలియన్ల ప్రపంచ ప్రజలు సాధారణ లేదా తీవ్రమైన ఆహార అభద్రతలో బతుకులు ఈడుస్తున్నారు. తీవ్రమైన ఆహార అభద్రతలో 864 మిలియన్ల ప్రపంచ ప్రజలున్నారు. ప్రతి ఒక్కరికి రోజుకు సగటున దాదాపు 3.96 డాలర్లు ఆరోగ్యకర భోజన ఖర్చులవుతున్నాయి. దీంతో 55.6 శాతం భారతీయులు ఆరోగ్యకర భోజనాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఐదేండ్లలోపు పిల్లల్లో స్టంటింగ్‌, వేస్టింగ్‌ సమస్యలు తగ్గినా, ప్రపంచవ్యాప్తం స్థూలకాయ సమస్యలు పెరుగుతున్నాయి. 15నుంచి 40 ఏండ్ల లోపు మహిళల్లో రక్తహీనత పెరుగుతూ ప్రజారోగ్యం పెద్దసమస్యగా ముందుకొస్తున్నది.
ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో 194.6 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపాలతో జీవిస్తున్నారు. దీర్ఘ కాలం పాటు ఆహార అభద్రత సమస్యలతో సతమతమవుతూ 13 శాతం ప్రజలు తీవ్రమైన పోషకాహార లోప సమస్యలతో బాధపడుతున్నారు. ”2023 ప్రపంచ ఆకలి సూచీ” జాబితాలో భారత్‌ 111వ స్థానానికి దిగజారడం మన దుస్థితులను వివరిస్తున్నది. దక్షిణాసియా దేశాల్లో ఇండియాలోనే అత్యధికంగా 18.7 శాతం వేస్టింగ్‌, అధికంగా 31.7 శాతం స్టంటింగ్‌ సమస్యలు పిల్లలకు ఎదురవుతున్నట్టు నివేదిక ద్వారా తెలిసింది. పోషకాహారలోపం కలిగిన తల్లుల వల్ల 27.4 శాతం శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని వెల్లడైంది. భారతీయ మహిళల్లో 53 శాతం రక్తహీనత, 2.8 శాతం పిల్లల్లో/7.3 శాతం పెద్దల్లో స్థూలకాయం నమోదుకావడం ఆందోళనకరమైన అంశం. కోవిడ్‌-19 సమయంలో ఆదాయం పడిపోవడం, జీవనోపాధులు తగ్గడం, ఆహార సరఫరా శృంఖలం గాడి తప్పడంతో ఆహార అభద్రత, పోషకాహారలోపం పెరిగిన మాట వాస్తవం. ఎస్‌ఓఎఫ్‌ఐ-2024 థీమ్‌గా ”ఆకలి, ఆహార అభద్రత, పోషకాహారలోపాలను అంతం చేయడానికి ఆర్థిక పెట్టుబడులు కావాలి” అనబడే అంశాన్ని తీసుకుంది. ఈ లక్ష్యంతో వ్యవసాయ ఆధార పరిశ్రమల ఏర్పాటు లేదా బలోపేతం చేయడం, అసమానతల తొలగింపు, ఆహార భద్రతను గాడిలో పెట్టడం, పోషకాహార లభ్యతకు వనరుల కల్పన లాంటివి ఫలిస్తాయనే ఆశిస్తున్నది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి చేరడానికి కావలసిన ఆర్థిక వనరులను ఆయా ప్రభుత్వాలు ప్రాధాన్యతాక్రమంలో కేటాయించాలని, 2030 నాటికి ఆకలి కేకలు వినిపించరాదని ఐరాస కోరుకుంటున్నది.
– బీఎంఆర్‌, 9949700037