టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతూ అనేక ఆవిష్కరణలకు వేదికవుతున్నది. స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వినియోగంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించేవారు, క్రియేటివిటీ ఉన్న వారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఆదాయాన్ని సృష్టించు కుని, దాన్నే ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. విభిన్నమైన కంటెంట్‌తో వీడియోలు చేస్తూ దానికి క్రియేటివిటీ జోడించి మిలియన్ల కొద్ది వ్యూస్‌ను రాబడుతున్నారు. ఇదే కోవలో ప్రపంచ యాత్రికుడిగా పేరొందిన యూట్యూబర్ రామకష్ణ ఆర్కె వరల్డ్ ట్రావిలర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని, ప్రపంచ దేశాలను చుట్టేస్తూ మంచి మంచి వీడియోలు చేస్తూ యూట్యూబర్‌గా హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. అక్కడి విశేషాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. గతేడాది జులైలో ప్రారంభమైన యాత్రలో ఇప్పటి వరకు 33 దేశాలను చుట్టి వచ్చాడు. ఈ ఏడాది చివరి నాటికి 100 దేశాలను సందర్శించాలన్న లక్ష్యం అతడిది. ఆర్కె వరల్డ్ ట్రావిలర్ రామకష్ణతో ఈ వారం జోష్ ముచ్చట..
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు రామకృష్ణ. మానవ వనరుల విభాగంలో ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన ఈ హైదరాబాదీ యువకుడు ఆనతి కాలంలోనే అంచలంచెలుగా ఎదిగాడు. తనకి ఉన్న పరిజ్ఞానంతో వత్తిలో స్వయంగా స్వదేశంతో పాటుగా అమెరికాలో సంస్థని నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తన తల్లికి ఉన్న అభిలాషని తన ఆశయంగా మార్చుకుని ప్రపంచయాత్రని మొదలుపెట్టాడు.
రామకష్ణ తల్లి చిన్నవయసులోనే వెన్నుముక సమస్యతో మంచానికి పరిమతమైంది. కష్టంలో తోడుగా ఉండాల్సిన తండ్రి మరో వివాహం చేసుకోవడంతో అమ్మమ్మ ఇంటికి (జనగామ) వచ్చేశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 10 నెలలు.. మరో వివాహం చేసుకున్న తండ్రి, నడుము నుండి పాదాల వరకు ఎలాంటి స్పర్శ లేని తల్లి… ఇలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన రామకష్ణ జీవితం నిజంగా చాలామంది యువకులకి ఆదర్శప్రాయం. చిన్ననాటి నుండి శాస్త్రీయ నత్యం మీద ఆసక్తితో కూచిపూడి నాట్యంపై పట్టు సాధించడంతో పాటూ 4 ఏండ్లు కష్టపడి కరాటే కూడా నేర్చుకున్నాడు. 16 సంవత్సరాల వయసులోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందాడు.
పాఠశాల విద్యతో పాటూ ఇంటర్మీడియట్ వరకూ జనగామలోనే పూర్తిచేసి గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడే బీసీఏ తోపాటు ఎంబీయే పూర్తిచేశారు. హైదరాబాద్‌లో చదువుకున్న ఈ ఐదేండ్లు చాలా కష్టాలు పడ్డాడు. ప్రతిరోజు అటూ ఇంటి పని, మరోవైపు పూర్తిగా మంచంలోనే ఉన్న అమ్మను చూసుకుంటూ, ఆమెకు సపర్యలు చేసేవాడు. అదే సమయంలో చదవుకుంటూనే కొంతకాలం చుట్టుపక్కల పిల్లలకు కూచిపూడి, కరాటే నేర్పుతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఆ తరువాత కొందరు మిత్రుల సలహా మేరకు రియల్ ఎస్టేట్ రంగంలో ఖాళీ సమయాన్ని కేటాయిస్తూ ఒక సంపాదన మార్గాన్ని నిద్దేశించుకున్నాడు. అనంతరం మానవ వనరుల రంగంలో సుమారు 13 ఏండ్లు లండన్‌తో సహ వివిధ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. 2016లో స్వంతగా ఒక ఐటీ కన్సల్టింగ్ సంస్థని అమెరికాలో నెలకొల్పాడు. బిజినెస్ కన్సల్టింగ్ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీని హోబోకెన్‌లో ప్రారంభించాడు. తద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాడు. వీటి ద్వారా ఏటా 5 మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది.
స్వతహాగా రామకృష్ణ తల్లి మంచి రచయిత్రి, కవయిత్రి కావడంతో ఆమెకు ఒక యూట్యూబ్ చానెల్ మొదలు పెట్టాలనే అభిలాష ఉండేది. కానీ గతేడాది ఆమె తన 60వ ఏట కన్నుమూశారు. ఇంత సాధించినా ఎక్కడో ఏదో లోటు.. ఎట్టి పరిస్తితుల్లో తన తల్లి కోరిక నెరవేర్చాలని, ఒకవైపు తన సంస్థ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు జులై 2023లో RK World Traveller అనే యూట్యూబ్ చానెల్‌ని ప్రారంభించి ప్రపంచ యాత్ర మొదలుపెట్టాడు. 2024 సంవత్సరంలోనే 100 దేశాలు తిరగాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఇప్పటికే ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఓషియానియా ఖండాలలో 49 దేశాలు చుట్టివచ్చారు. దేశాలు తిరగడం అంటే కాలక్షేపం కోసం కాకుండ అక్కడ ఉన్న వింతలు, విశేషాలు, వీడియోలు చిత్రించి యూట్యూబ్‌లో పెట్టి వీక్షకులకి మంచి పరిజ్ఞానం కూడా ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రామకష్ణ శాఖాహారి. ఒక శాఖాహారికి ప్రపంచ దేశాలు తిరగడం, ఆహరం విషయంలో చాలా కష్టం అనుకునేవాళ్ల అపోహలని తొలగిస్తూ తన ఆహర అలవాటుకి తగినట్లుగా తన ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ యూట్యూబ్ ఛానెల్ లక్షమంది పైగా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417