అక్కరకు రాని చుట్టం

పొడుగాటి రోడ్డు. మిట్ట మధ్యాహ్నం ఎండకు అద్దంలా మెరుస్తున్న రోడ్డు. ఖాళీ రోడ్డు. రోడ్డుకి రెండు పక్కలా ఒక్క చెట్టూ లేని రోడ్డు. సెగలూ పొగలూ కక్కుతున్న రోడ్డు.
రోడ్డు మీద కోడెత్రాసులా పాకుతున్న కారు. జరజరమంటూ జారుతున్నది ఆ కారు. జోరుగా హుషారుగా సాగుతున్నదా కారు. స్టీరింగ్‌ చక్రం పట్టుకున్న వ్యక్తి ఈలవేస్తూ వున్నాడు. ఈల వేస్తున్నవాడి ఒంటిమీద తెల్లటి ప్యాంటు తెల్లటి చొక్కా వున్నవి. ముఖంలో కొట్టవచ్చినట్టు కనిపించే ముక్కు వున్నది. జరజరమంటున్న కారు ఉన్నట్టుండి జర్కులివ్వడం మొదలుపెట్టింది. జోరుగా సాగుతున్న కారు హుషారు కోల్పోయింది. చక్రం పట్టుకున్న వ్యక్తి ఈల ఆగిపోయింది. కోడెత్రాసు పాకడం మానేసింది. నాలుగు చక్రాల కారు హుఫ్‌హుఫ్‌ అన్నది. ఓ చక్రం ఉసూరుమంది. కారు తడబడుతూ గంతులేసి సర్రుమంది. ఇంక ఏమీ అనకుండా నోరు మూసుకుని బొమ్మలా నిలబడిపోయింది.
చక్రం పట్టుకున్న వాడు, ఈల వేయడం ఆపివేసినవాడు నల్లముగం తెల్లబోయిన వాడు కారు ఆగిపోయిన వాడు ఏం చేయాలో తోచక కారు డోరు తెరిచాడు. డోరు తీసినవాడు కిందికి దిగాడు. మాడు చుర్రుమంది. వడగాలికి గూబ గుయ్యిమంది. తెల్లబోయిన నల్లముఖం వాడు, తెల్లప్యాంటు చొక్కా వున్నవాడు ఈల వేయడం మానేసినవాడు కారు డోరు తెరిచి కిందికి దిగినవాడు ఎండకు తట్టుకోలేక నీడ కోసం వెదికాడు. ఒంట్లో వున్న ఊపిరి మొత్తం పోయిన కారు టైరు కేసి చూశాడు. ఆకాశంలో పెద్ద గ్యాసు పొయ్యిలా మండుతున్న సూర్యుడికేసి అరచేతిని నుదుటికి ఆనించి చూశాడు. టైరు మార్చితే తప్ప మళ్లీ చక్రం తిప్పడానికి వీల్లేదు. ఎవరైనా వస్తే బాగుండును. స్టెపినీ బిగిస్తే బాగుండును. రోడ్డు మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ మనిషనే వాడి జాడలేదు. ఈ ఎర్రటి ఎండలో ఎవరొస్తారు అనుకున్నాడు. తెల్లబట్టలు వేసుకున్నవాడు. కొంతమందికి కాలం ఎందుకో కలిసి వస్తుంది. అనాయాసంగా అదృష్టం కొందరిని ఎందుకో అందలం ఎక్కించేస్తుంది. ఎవరూ తనకు సాయం రారనుకున్న వ్యక్తికి దూరంగా ఓ మనిషి వస్తున్న జాడ కనిపించింది. కలిసి వచ్చిన అదృష్టమే నాది ఎప్పుడైనా అనుకున్నాడు. టైరు పంక్చరయి కారు ఆగిపోతే దిగి కింద నిలబడ్డవాడు.
ఆ మనిషి కారు దగ్గరికి వచ్చాడు. వంటి మీద ఎర్ర చొక్కా వుంది. మెడను ఎర్ర రుమాలు చుట్టుకుని వుంది. ఎర్రటి ఎండలో ఎంత దూరం నుంచి నడిచి వస్తున్నాడో కాని చొక్కా వీపుకు అంటుకుని వుంది. ముఖం మీద చెమట చుక్కలు నక్షత్రాల్లా మెరుస్తున్నవి.
కారు పక్కన దిక్కుతోచక నిలబడ్డ వ్యక్తిని అడిగాడు, ఏమైంది సార్‌ అని. ఆ అడగడంలోనే సహాయం కావాలా అన్న భావం ధ్వనిస్తూ. నిన్ను చూడగానే ప్రాణం లేచివచ్చింది. నీకూ నాకూ ఏ జన్మ అనుబంధమో ఉన్నట్టు అనిపించింది కారులో నుంచి తీసిన రుమాలుతో చెమట తుడుచుకుంటూ అన్నాడు కారు ఓనర్‌. తెల్ల దుస్తుల కారు ఓనర్‌ భాష అర్థమై చిరునవ్వు నవ్వాడు ఎర్ర చొక్కా మనిషి. ‘టైరు మీరు మార్చలేరా’ అనడిగాడు. ‘మార్చ వచ్చును. కానీ తెల్ల చొక్కా నల్వబడదూ. అసలే ఎండ చురుక్కు ముఖం గుర్తు పట్ట వీల్లేకుండా మారిపోదూ’ అన్నాడు కారువాడు. ‘సరే’ డిక్కీ తెరిచి టైరు బైటకు తీస్తూ అన్నాడు ఎర్ర చొక్కా వాడు. ‘నిన్ను చూస్తుంటే ఎన్నో ఏళ్ల నుంచీ మన మధ్య స్నేహం ఉన్నట్టు అనిపిస్తుంది. నీ చొక్కా ఎరుపు నీ రుమాలు ఎరుపు. నేను ముఖం తుడుచుకుంటున్న రుమాలు, నా కారు కూడా దాదాపు అదే రంగు కదూ’ అన్నాడు తెల్ల చొక్కా వాడు. ఆ రంగూ ఈ రంగూ ఒకటి ఎలా అవుతాయి అందామనుకునీ మౌనంగా పని చేయసాగాడు ఎర్ర చొక్కా వ్యక్తి. ‘ఈ నిర్మానుష్య ప్రదేశంలో నువ్వు కనపడ్డం నా భాగ్యం. నాలోనూ నీలోనూ ప్రవహించేది ఒకే రక్తం. మనిద్దరం ప్రాణ స్నేహితులం. కాదు కాదు ఆత్మ బంధువులం. నాకు నీవు నీకు నేను. మనల్ని ఎవరూ విడదీయలేరు’ అన్నాడు ఎమోషన్ని గుప్పిస్తూ తెల్లచొక్కా మనిషి.
టైరు బిగించాక ఈ కారులో మా ఊళ్లో దించి పోతాడు దారిలోనే కద, ఇంత ప్రేమ ఒలకబోస్తున్నాడు అనుకున్నాడు ఎర్ర చొక్కా వాడు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని తెల్లచొక్కా వ్యక్తి పాట అందుకోవడంతో తను నడవాల్సిన నాలుగు మైళ్లూ ఇక హాయిగా కారులో వెళ్లవచ్చుననుకున్నాడు. టైరు బిగించడం అయిపోయింది. తెల్లచొక్కా వ్యక్తి డ్రైవింగ్‌ సీట్లో కూచున్నాడు. ఇక తనను కూర్చోమంటాడనుకుని ఎదురు చూశాడు ఎర్రచొక్కా వ్యక్తి. నట్లు బాగా ఫిట్‌ చేశావు గదా. నీ పేరేమిటోరు అన్నాడు కారు స్టార్టు చేస్తూ కారు వోనర్‌. ఆ గొంతులో ఇంతకు ముందున్న మెత్తదనం స్థానంలో దర్జా చోటు చేసుకుంది. నా పేరు ఎప్పుడో మర్చిపోయాను. నన్నందరూ ‘కామ్రేడ్‌’ అంటారు. నన్ను మా ఊళ్లో డ్రాప్‌ చేస్తారా సార్‌ అనడిగాడు ఎర్ర చొక్కా కామ్రేడ్‌. టైర్‌ బిగించినంత మాత్రన కారు ఎక్కాలనుకోవద్దు. ఇక నా దారి నాది, నీ దారి నీదే అన్నాడు తెల్ల చొక్కా మడత నలగనీకుండా చూసుకున్న వాడు.
‘రుమాళ్ల రంగు ఒకటే అన్నారు. బంధం అన్నారు. స్నేహమన్నారు. ఒకటే రక్తమని కూడా అన్నారు’ అన్నాడు కామ్రేడ్‌. ‘అవసరం తీరడం కోసం ఎన్నయినా అంటామోరు. కొంచెం రంగు దగ్గరగా వున్నా మన రుమాళ్ల రంగులు వేరే వేరే. ఇక రక్తం అంటావా అది ఎరుపే అయినా ‘గ్రూప్‌’ వేరే కదా. నా మాటలు నమ్మేశావా. నమ్మించి మోసం చేయడం నాకు కొత్తేమీ కాదు’ అన్న కారు ఓనర్‌ చక్రం తిప్పాడు. ఖాళీ రోడ్డు మీద జరజరమంటూ జారిపోయింది కారు. ఎర్ర రుమాలుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ నిలబడిపోయాడు కామ్రేడ్‌!

– చింతపట్ల సుదర్శన్‌
9299809212