ధ్వంసమైన మున్సిపల్‌ వాహనం

A wrecked municipal vehicleనవతెలంగాణ-మంచిర్యాల
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో బయో టాయిలెట్స్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం ధ్వంసం అయింది. బుధవారం పిప్రిలో జరిగిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభకు వెళ్లి వచ్చే క్రమంలో వాహనానికి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలోని బయో టాయిలెట్‌ల కోసం ఉపయోగించే ఈ వాహనానికి ఉన్నదీ ఒక్కరే డ్రైవర్‌, అతను కూడా బుధవారం లీవ్‌ మీద హైద్రబాద్‌లోని హాస్పిటల్‌కి వెళ్ళాడు. అదే సమయంలో అర్హత లేని డ్రైవర్‌ సభకు వాహనాన్ని తీసుకెళ్లడంతో వాహనం ధ్వసం అయినట్లు తెలిసింది. జరిగిన విషయంపై మున్సిపల్‌ సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ ఉదరుని వివరణ కోరగా అట్టి వాహనానికి నియమించిన డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఆ వాహనాన్ని తీసుకెళ్లినట్లు తెలిపాడు. ఒక వైపు బయో టాయిలెట్‌ వాహనాన్ని నిత్యం నడిపే డ్రైవర్‌ శ్రీనివాస్‌ లీవ్‌లో ఉండగా అదే డ్రైవర్‌ అట్టి వాహనాన్ని సభకు తీసుకెళ్లినట్లు సదరు అధికారి తెలపడం పలు అనుమానాలకు దాతిస్తోంది. ధ్వంసం అయిన వాహనానికి బాధ్యులెవరనేది తెలియవల్సి ఉంది.కాగా మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌ని వివరణ కోరగా బయో టాయిలెట్‌ వాహనానికి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని ఈ విషయంపై విచారణ చేపడతామని తెలిపారు.