కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓటు తొలగించాలని రిట్‌ దాఖలు

కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓటు తొలగించాలని రిట్‌ దాఖలునవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్‌
పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని ఓటు తొలగించాలని నాగర్‌ కర్నూల్‌ వాసి కె. దేవ వేసిన రిట్‌ పిటీషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ ఎన్‌.వి శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో యశస్విని నివాసం. పాస్‌పోర్టు కూడా అదే అడ్రస్‌తో ఉందని, విదేశాల్లోనే ఎక్కువ కాలం ఉన్న ఆమెకు అచ్చంపేట నియోజకవర్గంలో ఓటు ఎలా ఉందని ఫిర్యాదు చేస్తే ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. డ్రాఫ్ట్‌ ఓటర్ల లిస్ట్‌, సవరణ ఓటర్ల లిస్ట్‌, తుది ఓటర్ల లిస్ట్‌లను అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.
స్థానిక నివాస పత్రం ఎలా ఇస్తారు?
ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఏపీలో చదివినట్లుగా పిటిషనర్‌ వెన్నెల స్వయంగా చెబుతున్నారని, ఆమెకు తెలంగాణలో నివాసం ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రం ఎలా ఏ చట్ట నిబంధన ప్రకారం ఇచ్చారని గద్వాల ఎమ్మార్వోను హైకోర్టు ప్రశ్నించింది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నివాస తనిఖీకి వెళ్లి ఇచ్చిన నివేదిక ప్రకారం ఇచ్చామని వ్యక్తిగతంగా విచారణకు హాజరైన ఎమ్మారో తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వివరణతో సంతృప్తి చెందని కోర్టు వచ్చే నెల 4న జరిగే విచారణకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, ఎమ్మార్వోలు ఇద్దరూ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరథే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది.
దర్శకుడు రాఘవేంద్రరావుకు నోటీసులు
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ప్రాంతంలోని షేక్‌పేట్‌లో రెండు ఎకరాల భూమిని సినీ పరిశ్రమ అభివద్ధి కోసం కేటాయిసే,్త దానిని సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఇతరులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే పిల్‌పై హైకోర్టు స్పందించింది. రాఘవేంద్రరావు, ఆయన బంధువులకు మరోసారి నోటీసులు ఇచ్చింది. గత ఏడాది మార్చిలో ఇచ్చిన నోటీసులు అందినట్లుగా రికార్డుల్లో లేకపోవడంతో గురువారం మళ్లీ నోటీసుల్ని జారీ చేసింది. బంజారాహిల్స్‌ సర్వే నెం. 403/1లో రెండు ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ మెదక్‌కు చెందిన బాలకిషన్‌ 2012లో పిల్‌ దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరథే, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించి ప్రతివాదులైన రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కె.కష్ణమోహన్రావు, కె.ఎస్‌.చక్రవర్తి, కె.విజయలక్ష్మి, కె. అఖిలాండేశ్వరి, కె. లాలసదేవిలకు నోటీసులిచ్చింది. సినీ పరిశ్రమను హైదరాబాద్‌లో అభివృద్ధి చేసేందుకు 1984లో రెండు ఎకరాలను ప్రభుత్వం రాయితీ ధరకు కేటాయించింది. అయితే గత కొన్నేండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా రాఘవేంద్రరావు ఇతరులు పబ్స్‌, బార్స్‌, థియేటర్ల కోసం వినియోగిస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదని పిటీషనర్‌ ఆరోపించారు. కేసును తదుపరి విచారణను జనవరి 18కి వారుదా వేసింది.
జిల్లా జడ్జీలుగా పదోన్నతులు
సీనియర్‌ జడ్జీలు 16 మందికి జిల్లా జడ్జీలుగా హైకోర్టు ప్రమోషన్స్‌ ఇచ్చింది. ప్రమోషన్లో భాగంగా వీరిని ఇతర కోర్టులకు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఈ నెల 17లోగా కొత్త పోస్టుల్లో చేరాలని, ఈలోగా కేసుల విచారణ ముగించి రిజర్వులో పెట్టిన కేసుల్లో తీర్పులు చెప్పాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
వాణిజ్య కోర్టుకు హెచ్‌సీఏ, విశాఖ ఇండిస్టీస్‌ వివాదం
4 వారాల్లోగా పరిష్కరించాలని కింది కోర్టుకు హైకోర్టు ఆదేశం ఉప్పల్‌ స్టేడియం డెవలప్‌మెంట్‌ వర్క్స్‌ విషయంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ), విశాఖ ఇండిస్టీస్‌ మధ్య నెలకొన్న వివాదాన్ని తిరిగి వాణిజ్య కోర్టుకు పంపుతూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరి మధ్య తలెత్తిన ఆర్థిక లావాదేవీల వివాదాన్ని నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని వాణిజ్య కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ అరాదే, జస్టిస్‌ ఎన్‌. వి. శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం ఆదేశాలను జారీ చేసింది. వాణిజ్య వివాదానికి సంబంధించిన కేసులను పరిగణనలోకి తీసుకోకుండా తమ ఆస్తుల జప్తునకు వాణిజ్య వివాదాల కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ హెచ్‌సీఏ తరఫున అడ్మినిస్ట్రేటర్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ అరాదే, జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది.
2016 ఏడాది మార్చి 15న వెలువడిన ఆర్బిట్రేషన్‌ అవార్డును అమలు చేయక పోవడంతో గత ఏడాది అక్టోబర్‌ 6న స్టేడియం, ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చింది. అయినా హెచ్‌సీఏ పట్టించుకోక పోవడంతో హెచ్‌సీఏ ఆస్తులు, బ్యాంక్‌ ఖాతాల సీజ్‌ ఆర్డర్‌ వెలువడిందని విశాఖ ఇండిస్టీస్‌ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు.. హెచ్‌సీఏ రూ.17.5 కోట్లను ఆరువారాల్లోగా విశాఖ ఇండిస్టీస్‌కు చెల్లించాలని గత విచారణ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం అప్పీల్‌ విచారణ సందర్భంగా వివాదం వాణిజ్య కోర్టులో విచారణలో ఉన్నదని హెచ్‌సీఏ అభ్యర్థన మేరకు అదే కోర్టులో తేల్చుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారి చేసింది.