గాజా మారణకాండకు ఏడాది… తప్పుడు వార్తలతో మీడియా దాడి!

One year since the massacre of Gaza... media attack with false news!తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయిల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయిల్‌ మీద హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండింది అంటోంది. హమాస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమాస్‌ ఒకటి. దాని దాడులు గతేడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా ఇజ్రాయిల్‌ మారణకాండ సాగిస్తోంది. ఇప్పటి వరకు 42వేల మందిని చంపింది. పదివేల మంది జాడే లేదు. లక్ష మంది వరకు గాయపడ్డారు. లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతూనే వుంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకంటే హమాస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయిలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబు తున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయిల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.
ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమాస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయిల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయిలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇదొక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధ రంగం లో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదిం చేందుకు పని చేస్తున్నదెవరో అర్ధమవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పనిచేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.
ఇజ్రాయిల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయిల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొ న్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్న తరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమాస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయిల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ (మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు, బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్న దాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019-21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేసింది.మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయిల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ”గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయిల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ” ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించింది. దాని దుర్మార్గాలను సమర్ధించింది.
హమాస్‌ దాడిచేసి నలభైమంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయిల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడారు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయిల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్ల్యూ బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరిం చాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.
అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండించాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయిల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలనిచ్చాయి? ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమాస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమాస్‌ సాయుధులు ఇజ్రాయిలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పదప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం ఒత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయిల్‌కు అనుకూలంగా ఒత్తిడి చేసి అనేకమంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమాస్‌తో సంబంధాలున్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయిల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పనిచేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పదిమంది విలేకర్లు ఇజ్రాయిల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడించారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయిల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని ఒత్తిడి చేసినట్లు తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో పరిశీలన ద్వారా వెల్లడైంది.
తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కథలను నమ్మటం లేదన్నది వాస్తవం.ఇజ్రాయిల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదనశక్తిగా యువత మారుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది. యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవై నందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయిల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతునిస్తున్నది.

ఎం కోటేశ్వరరావు, 8331013288