– అమానవీయదాడులకు గాజాలో 42 వేల మంది మృతి
– లెబనాన్, ఇరాన్‌కూ విస్తరించిన దాడులు
కైరో : ఉగ్రవాదాన్ని అంతమొందించే పేరుతో పాలస్తీనా పౌరులను లక్ష్యంగా చేసుకొని గాజా స్ట్రిప్‌లో యుద్ధోన్మాదంతో ఇజ్రాయిల్ దాడులను ప్రారంభించి ఈ నెల 7 నాటికి ఏడాది పూర్తయింది. అమానవీయ దాడులను ప్రతిఘటించేందుకు ఇజ్రాయిల్‌లో హమాస్‌కు చెందిన సాయుధులు గతేడాది ఏడున దాడులకు పాల్పడ్డారు. వంద మంది పైగా ఇజ్రాయీలను అదుపులోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. చిన్నారులు, మహిళలు, శరణార్థులతో సహా అమాయక పాలస్తీనా ప్రజలను లక్ష్యంగా చేసుకొని వైమానిక, భూతల దాడులు చేస్తూవస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ అక్కడి ప్రజలు తలదాచుకున్న పాఠశాలలపైనా, ఆసుపత్రులపైనా, మసీదులపైనా ఇజ్రాయిల్ బలగాలు దాష్టీక దాడులకు తెగించాయి. వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఘోరమైన హింసాత్మక దాడుల్లో చిక్కుకుపోయిన గాజా ప్రజానీకం అంతులేని పెను విషాదాన్ని చవిచూస్తున్నారు.
మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీ సాయుధుల దాడుల, ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, అమెరికా నీచపు సైనిక ఎత్తుగడలతో మధ్యప్రాచ్య ప్రాంతం రణభూమిగా మారిపోయింది. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయిల్ మరింతగా రెచ్చిపోయి లెబనాన్‌లోనూ భూతల దాడులకు తెగించింది. ఈ దాడుల్లో అనేక మంది చనిపోయారు. వేలాది మంది రక్షిత ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇరాన్‌కు కూడా ఈ దాడులు విస్తరించాయి. ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో ఒక్క గాజా స్ట్రిప్‌లోనే దాదాపు 42,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆ ప్రాంతంలోని మొత్తం జనాభాలో 2 శాతంగా ఉంది. ఇక్కడి జనాభాలో 90 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు బలవంతంగా తమ ఇళ్లను ఖాళీ చేసి రక్షిత ప్రాంతాలకు వలస వెళ్లారు. రక్షిత శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధిత పాలస్తీనీయన్లకు మానవతాసాయం అందించేందుకు వెళ్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలను కూడా ఇజ్రాయిల్ అడ్డుకుంటూ వస్తోంది. సహాయక సామగ్రి వెళ్లనీయకుండా భద్రతా బలగాలతో అడ్డుకుంది. కుటుంబాలకు కుటుంబాలు చిధ్రమయ్యాయి. జీవనోపాధులకు దిక్కులేకుండా పోయింది. భవిష్యత్ సంపద అయిన చిన్నారులపై ఇజ్రాయిల్ యుద్ధోన్మాద దాడులు మాయనిమచ్చలుగా మిగిలిపోయాయి.
ఈ దాడుల్లో పాలుపంచుకున్న ఇజ్రాయిల్ సైనికులు కూడా పెద్ద సంఖ్యలోనే చనిపోయారు. గతేడాది అక్టోబరు 7న జరిగిన హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ఆ తర్వాత దాడులు, ఇతర ఘటనల్లో కనీసం 350 మంది ఇజ్రాయిలీ సైనికులు చనిపోయారు. అంతకంతకూ పెరిగిపోతున్న మానవ హనాన్ని, హింసకు అడ్డుకట్ట వేయాలని శాంతియుత చర్చలే అందుకు పరిష్కారమార్గమని అంతర్జాతీయంగా ప్రగతిశీల శక్తులన్నీ నినదిస్తూవున్నా..
ఇజ్రాయిల్‌లోని నెతన్యాహూ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. అయితే ఈ విషయంలో అగ్రరాజ్యాలుగా చెప్పుకునే దీశాల తీరు చాలా దుర్మార్గంగా ఉంటోంది. ఎప్పటిలాగే అమెరికా తన యుద్ధోన్మాద వికృత రూపాన్ని నిస్సిగ్గుగా చాటుకుంటోంది. ఇజ్రాయిల్‌కు సైనికంగా, ఆర్థికంగా గణనీయమైన సహాయాన్ని అందిస్తూ దాడులకు ఆజ్యం పోస్తోంది. మరోవైపు కమ్యూనిస్టు చైనా శాంతియుత పరిష్కారం కోసం ఎనలేని కృషి చేస్తోంది. దాడులకు స్వస్థి పలికి కాల్పుల విరమణ పాటించాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినా ఇజ్రాయిల్ పెడచెవిన పెట్టడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ న్యాయాన్ని అపహాస్యం చేయడమేని ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధి ఫు కాంగ్ అన్నారు. ఇజ్రాయిల్ సాగిస్తున్న హింసకు తెరపడాలంటే అంతర్జాతీయ సమాజం ఒకతాటిపై నిలిచి దౌత్యపర ఒత్తిళ్లు తీసుకురావడం ద్వారానే ఇజ్రాయిల్‌కు ముకుతాడు వేయగలని వివిధ ప్రజా సమూహాలు నినదిస్తున్నాయి.