ఐక్య ఉద్యమ సంవత్సరం

2024 సంవత్సరం ముగిసి వారం రోజులైంది. ప్రస్తుతం 2025 వర్తమానంలో మనం నడుస్తున్నాం. కొత్తగా మారిందేమీ లేదు. నూతన సంవత్సరం అనగానే ఒక్కరోజు హడావిడి చేసి మళ్లీ ఎవరిపని వారే చేసుకుంటున్నారు. ఇందులో ప్రత్యేకత ఏముంది? సాధించిన విజయాలు కావచ్చు, లేదంటే ఓటమికి గల కారణాలు కావచ్చు, ఏవైనా విశ్లేషించుకున్నామా? జీవన గమనం ఇలానే ఉండాలనే దిశానిర్దేశం చేసుకున్నామా? వినియోగదారి సంస్కృతిలో న్యూ ఇయర్‌ కూడా ఒక భాగమాయే! కానీ, మనం సమాజాన్ని అర్థం చేసుకుంటు న్నామా? పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నామా? దేశంలో జరుగుతున్న పరిస్థితుల్ని గమనిస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి, పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక, కర్షకులపైనే కాదు మధ్యతరగతి ప్రజలపై కూడా పడి తల్లడిల్లుతున్నారు. నిత్యజీవితంలో అత్యంత ముఖ్యమైనవి విద్య, వైద్యం, ఆహారం. కానీ మానవ జీవన విధానంలో ఖర్చయ్యేది వీటికే ఎక్కువ. ఆహార ద్రవ్యోల్బణం ప్రభావంగా కూరగాయలు 28శాతం, పప్పులు 17, తృణధాన్యాలు 8.6, మాంసహారం 8.2, గుడ్లు 7.1, టమాట 42.4, ఉల్లి 62.2, బంగాళ దుంపలు 65.3శాతం పెరుగుతున్నాయి. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఆహార సబ్సిడీపై బడ్జెట్‌లో రూ.7,082కోట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణం గతేడాది నవంబర్‌ నెలలో గ్రామీణ ప్రాంతంలో 5.3శాతం నుండి డిసెంబర్‌లో 5.6శాతంగా పెరిగింది. పట్టణ ద్రవ్యోల్బణం 4.2 శాతం నుండి 4.4శాతానికి పెరిగింది. భారతదేశ ద్రవ్యోల్బణం రేటు 2023లో 14 శాతంగా ఉంది. దేశ మధ్య తరగతి కుటుంబాలు దిగువ తరగతికి, దిగువ తరగతి మరింత పేదరికంలో పడిపోతున్నవి. ఆరోగ్య ఖర్చుల కారణంగా 6.3 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. దీనికి ఆహార, వైద్య ద్రవ్యోల్బనం ప్రధాన కారణాలుగా ఉన్నవి. ఈ రెండు రంగాలను వాణిజ్యకరించి తమ లాభాలను ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేట్‌ శక్తులు పెంచుకుంటున్నాయి. ప్రజలు 62శాతంమంది తమకు వచ్చే కొద్ది ఆదాయాల నుంచే వైద్యానికి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉబ్బసం, గ్లూకోమా, తలసేమియా, క్షయ, మానసిక ఆరోగ్యం రుగ్మతలకు చౌకగా వచ్చే ఔషధాల ధరలను ఏకంగా 50శాతానికి పెంచింది.అంటే కార్పొరేట్లు నడిపే ఫార్మా రంగానికి లాభాలు కట్టబెట్టి, సామాన్య ప్రజల్ని పీల్చిపిప్పి చేయడమే కదా. జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి రోజు 19 కోట్ల మంది ఆకలికి గురవుతున్నారు. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ సూచిలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. నిరుద్యోగ రేటు, లేబర్‌ పార్టిసిపేషన్‌ రేట్‌ చూస్తే 2014లో 5.44శాతం ఉంటే 2024 జూన్‌ నాటికి 9.2 కి చేరుకుంది. ఇదిఇలా ఉంటే కార్పొరేట్లకు పన్నుల వాటాను కంపెనీలకు 32శాతం నుంచి 22శాతానికి, తయారీ రంగానికి 25శాతం నుంచి 15శాతం తగ్గించడం జరిగింది. ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాల వలన ఒక శాతం ఉన్న సంపన్నుల చేతుల్లోనే 40శాతం దేశ సంపద కలిగి ఉండటం ఆందోళనాకరం. ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితా ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ 2023 ప్రకారం 83.4 బిలియన్‌ డాలర్ల సంపదతో ముఖేష్‌ అంబానీ 9వ స్థానంలో ఉన్నాడు. ఆదానీ 82.53 బిలియన్‌ డాలర్ల సంపద కలిగి ఉన్నాడు. నిజంగా దేశ ప్రజలందరూ 2025లో సంతోషంగా ఉండాలంటే సంపన్నులకు అప్పనంగా దోచిపెడుతున్న డబ్బును పేదల సంక్షేమానికి ఉపయోగించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అందుకుగాను పోరాటాలే ఏకైక మార్గంగా ఎన్నుకోవాలి. సంపన్నులకు రాయితీలిస్తూ పేదలపై వేస్తున్న భారాలపై ప్రశ్నించాలి. అవసరమైన చోటల్లా నిలదీయాలి. 2025ను ఐక్య ఉద్యమాల సంవత్సరంగా రూపొందించుకోవాలి. అప్పుడే మనకు ఈ మాత్రమైనా సంతోషం, ఆనందం మిగులుతాయి. లేదంటే గతేడాదిలాగే ఈ ఏడాది ఉంటుంది.కొత్తగా మారేదేమీ ఉండదు.
– కొండపల్లి శ్రీధర్‌, 8639295777