రైతులకు ‘భరోసా’నివ్వని ఏడాది పాలన

A one-year rule that does not give 'reassurance' to farmersరాష్ట్రంలో 2023 డిసెంబర్‌ 9న అధికారానికి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు అనేక వాగ్దానాలు ప్రకటించింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సి నవి కొన్ని ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పేరుతో భూమి ఉన్న రైతులతో పాటు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు, భూమిలేని ఉపాధి హామీ రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీనిచ్చింది. అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపింది. పంటల బీమా, భూమి యాజమాన్య హక్కులను అందిం చటం, నకిలీ విత్తన వ్యాపారులపై పిడి యాక్ట్‌ వంటి తప్పకుండా అమలు చేస్తామని పేర్కొంది. ప్రతీ ఎకరాకు సాగు నీరందేలా, నిర్ధిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి చేస్తామని చెప్పింది. రైతు కమిషన్‌, కొత్త వ్యవసాయ విధానాలతో పాటు మరిన్ని హామీలనిచ్చింది. ఈ హామీలన్నీంటిని ఏడాదిలో పూర్తి చేస్తానని ఒక్కో హామీకి తేదీలు కూడా ఖరారు చేసింది. మరి ఏడాదికాలంగా రైతాంగానికి ఇవన్నీ హామీలు అమలు చేసిందా? వాస్తవ పరిస్థితి ఏమిటి?
రుణమాఫీ, రైతు భరోసా ఏది?
రూ.2 లక్షల లోపు పంటరుణాన్ని 2024 ఆగష్టు 15లోపు రద్దు చేస్తానని ప్రకటించింది. కానీ ఆగష్టు 15 నాటికి 22,07,067 మందికి రూ.17,869.20కోట్లు, నవంబర్‌ 2024లో 2.80లక్షల మందికి రూ.2,860కోట్లు మాఫీ చేసింది. ప్రభుత్వం అంచనా ప్రకారం 41లక్షల మందికి 31వేల కోట్లు మాఫీ చేయాల్సివున్నా సాంకేతిక కారణాల సాకుతో మాఫీ చేయలేదు. పైగా ఇంకా మాఫీ చేస్తామని మ ంత్రులు ప్రకటిస్తూనే వున్నారు. ఈ జాప్యం వల్ల రైతులకు బ్యాంకులు రుణాలివ్వవడం లేదు. 2024-25కు బ్యాంకర్ల కమిటీ పంట రుణాల కింద రూ. 81,477.09 కోట్లు కేటాయించినప్పటికీ వానాకాలం 27,485 కోట్లు మాత్రమే పంట రుణాలిచ్చి చేతులు దులుపుకుంది. దీంతో రైతులు అధిక వడ్డీకి ప్రయివేటు వ్యాపారులపై ఆధారపడి రూ.20వేల కోట్లకు పైగా రుణాలు తెచ్చిన పరిస్థితి నెలకొంది. దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో ప్రవేశ పెట్టిన రైతుబంధు 2023 వానాకాలం నాటికి రూ.79,714.49 కోట్లు 65లక్షల మంది రైతులకు పంపిణీ చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023-24 యాసంగికి 69.86లక్షల మందికి రూ.7,625.75కోట్లు చెల్లించింది. కానీ 2024-25 వానాకాలం రైతు భరోసాని ఎగ్గొట్టింది. విధానపరమైన నిర్ణయం శాసనసభలో జరపాలని, ఎవరికి రైతు భరోసా ఇవ్వాలో తేల్చాలని వాయిదా వేసింది. కనీసం యాసంగికి 2025 జనవరి 15 సంక్రాంతి వరకు ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
పంటలకు మద్దతు ధర ఇచ్చేదెన్నడు?
అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీనిచ్చినా కేవలం ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. రాష్ట్రంలో గతంకన్నా 8వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, వానాకాలం ఉత్పత్తి మొత్తాన్ని ఆఖరిగింజ వరకు కొనుగోలు చేస్తా మని పదేపదే ప్రకటిస్తున్నది. అత్యధికంగా 155 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్లు, 90లక్షల టన్నులు మార్కెట్‌కు వస్తుందని తెలి పింది. కొనుగోలుకు రూ.10,547కోట్లు కేటాయించింది. కానీ మార్కెట్‌ల లో తేమ, నాణ్యత ప్రమాణాలను కారణాలు చూపి క్వింటాల్‌కు 5 కిలోల వరకు కోత పెడుతున్నది. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం పదిరోజుల వరకు అమ్మకాలు సాగడం లేదు. మార్కెట్లలో ప్లాట్‌ఫామ్‌, టర్ఫాలిన్స్‌ అందుబాటులో లేవు. అమ్మిన ధాన్యం డబ్బులు కూడా రైతుల అకౌంట్లలో ఆలస్యంగా వేస్తున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పినా నెరవేర్చలేదు. వరికి రూ.500, మొక్కజొన్నకు రూ.330, కందులు రూ.400, సోయా రూ.450, పత్తి రూ. 475, జొన్నలు రూ.292, మద్దతు ధరలు మిరప రూ.15వేలు, పసుపు రూ.12వేలు, ఎర్రజొన్న రూ.3,500, చెరుకు రూ.4వేలు క్విం టాల్‌కు నిర్ణయిస్తూ ప్రకటించారు. కానీ వాగ్ధానానికి భిన్నంగా సన్న ధాన్యానికి రూ.500లు మాత్రమే ఇస్తున్నారు. మొత్తం వరి ధాన్యంలో 30శాతానికి లోపు ఉంది. తక్కువ మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
అఖిలపక్షం సలహాలు ఏం చేశారు?
ధరణి చట్టంలో అనేక లోపాలున్నాయని, దాన్ని రద్దు చేసి భూమాతను తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎం.కోదండరెడ్డి కన్వీనర్‌గా ఏడుగురితో వేసిిన రైతు సంక్షేమ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ 2024 ఆగష్టు 8న అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి సలహాలు కోరింది. ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదాపై అనేక సవరణలొచ్చాయి. 1. గత ప్రభుత్వం ధరణిలో రద్దు చేసిన ”పాసు పుస్తకాల చట్టం 1971 సెక్షన్‌ 26” దానిని తిరిగి పునరుద్ధరించాలని సమావేశం సూచించింది. దీని వలన వాస్తవ సాగు దారులకు కౌలు దారులకు హక్కు పునరుద్ధరించబడుతుంది. రిజిస్ట్రేషన్‌ 19 రకాల భూములకు అంగీకరిస్తూ ముసాయిదా చట్టంలో చూపారు. కానీ, 1948 జాగీర్‌దారి రద్దు కిందగల జాగీర్‌ భూములు, పాయిగా, సంస్ధాన్‌, మక్తా, ఆగ్రహర గ్రామం, ఉమిలీ, ముకాసా భూములకు పాస్‌ పుస్తకాలివ్వకూడదు. అవి ప్రభుత్వ ఆధినంలోనే ఉంటాయన్న ముసా యిదాను సవరించాలని అభిప్రాయం తెలిపింది. వ్యవసాయ భూములకు, వ్యవసాయేతర భూములకు (రియల్‌ ఎస్టేట్‌) విడిగా రిజిస్టర్లు తయారు చేయాలని, 2జూన్‌2014 నాటికి తెల్లకాగితాలపై కొనుగోలు చేసిన భూములకు ఆస్తుల బదలాయింపు చట్టం-1882, రిజిస్టేషన్‌ చట్టం-1908 ప్రకారం పట్టాలివ్వబడతాయి. సాదాబైనామాల గడువును జీవో 150 ప్రకారం 15జూన్‌2016 వరకు ఫారం 10 ఇచ్చిన వారికి వర్తింపచేయాలని అఖిలపక్షం కోరింది. వీలునామా, వారసత్వ ముటేషన్‌కు ఎలాంటి రిజిస్ట్రిషన్‌ ఫీజు వసూలు చేయకూడదని, గ్రామంలో రికార్డులను తయారుచేయడానికి రెవెన్యూ వీఆర్‌ఎలను నియమిస్తామని ముసాయిదాలో చెప్పబడింది. భూముల కేసులపై ఆఫిల్‌ చేయడానికి జిల్లా కలెక్టర్‌ లేదా సిసిఎల్‌ఎ దగ్గరికి వెళ్లాలని చేసిన సూచనను ఆఖిలపక్షం వ్యతిరేకించింది. ప్రతి జిల్లా కేంద్రంలో నోడల్‌ ఆఫీసర్‌ను పెట్టాలని, ఈ చట్టాన్ని తరహా ఆమోదించి అమలు చేయాలని సమావేశంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది కాక ప్రజాపాలనలో వచ్చిన 1.28 కోట్ల దరఖాస్తుల్లో 70లక్షల దరఖాస్తులు భూసమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. వీటిని సరిచేయ డానికి 20 రోజులు కార్యక్రమం తీసుకుని ఇంతవరకు పెండింగ్‌లోనే పెట్టింది. రైతుల సమస్యల్ని పరిష్కరించే పద్ధతి ఇదేనా?
భూ దరఖాస్తుల పరిష్కారమెప్పుడు?
భూమాత చట్టాన్ని (ధరణి) ఆమోదించి, ప్రజాపాలనలో వచ్చిన భూ దరఖాస్తులను విచారించి వాస్తవ సాగు దారులందరికీ పాసు పుస్తకాలివ్వాలి. ఇప్పటికే లక్షలాది మంది ఏడాది కాలంగా ఈ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాలు, సివిల్‌ కోర్టుల చుట్టూ చెప్పుల రిగేలా తిరుగుతున్నారు. కౌలుదారులకు హక్కులు కల్పించాలి. ప్రస్తుత శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున ఈ పథకాల్ని ఆమోది ంచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే ముసాయిదాలోని లోపాలను సరిచేయాలి. రాష్ట్రానికి వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి. భూసార పరీక్షలు నిర్వహించాలి. పంటల విధానాన్ని రూపొందించి రాష్ట్రాన్ని దిగుమతుల నుండి రక్షించాలి. నకిలీ విత్తన వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నకిలీ విత్తన వ్యాపారం సజావుగా సాగిపోతునేవుంది. రైతులు నష్ట పోతూనే ఉన్నారు. సంస్ధాగతంగా, చట్ట పరంగా చేపట్టాల్సిన చర్యలు శూన్యం.ప్రధానంగా ఆత్మహత్యల నివారణకు, కౌలుదారులకు చట్టపరమైన రక్షణ కల్పించాలి. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పనతో పాటు చట్టాల్లో మార్పు చేయాలి. 65 ఏండ్లు దాటిన రైతులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలి. రైతు బీమాలో మార్పు చేయాలి. జిల్లా స్ధాయిలో అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతులెదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలి. లేదంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగంలోనే కాదు, ప్రజల్లోనూ విశ్వాసం కోల్పోతుంది.
మూడ్‌ శోభన్‌
9949725951