నాయకులుగా ఎదగాలని చాలా మంది కోరుకుంటారు. అయితే నాయకులు ఎపుడూ అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడరు. లేదా ‘ఇది నా జన్మహక్కు’ అన్నట్లు ఏ రాజకీయ కుటుంబంలోనో జన్మించరు. అలా వచ్చినవారు ఎవరూ నిజమైన నాయకులు కారు.. కాలేరు. దేశశ్రేయస్సే లక్ష్యంగా, జనరంజకంగా పరిపాలన చేయాలంటే నాయకులు ముందుగా తమకొక అర్హత సంపాదించుకోవలసిందే. అందుకు జ్ఞానాన్ని మించిన అర్హత మరొకటి లేదు. అదే వినయాన్ని, మంచిచెడుల విచక్షణను, మానవత్వాన్ని, మహనీయ గుణాలను ఆపాదించి పెడుతుంది. ఇందుకోసం విద్యార్థి దశలోనే యువత చదువుమీద శ్రద్ద పెట్టి జ్ఞానసముపార్జన చేయాలి.
ముఖ్యంగా రాజకీయ నాయకులు కావాలంటే విద్యార్థి దశలో కేవలం పాఠ్యపుస్తకాలు చదివి ఫస్ట్‌క్లాస్‌లో పాసవటమే ధ్యేయంగా పెట్టుకుంటే సరిపోదు. ఇతర పుస్తకాలూ విస్తారంగా చదవాలి. చరిత్ర పుటల్లో ఉన్న ఆనాటి రాజకీయ నేతల జీవిత విశేషాలు, వారి పరిపాలనా విధానం, మహనీయుల బోధనలు, తత్వవేత్తల ప్రవచనాలు వినడం, చదవడం చేయాలి. వీటన్నిటినీ మించి ముందుగా ‘రాజ్యాంగం’ చదవాలి. సమకాలీన సామాజిక పరిస్థితులపై క్రమంగా అవగాహన కలిగించుకుంటూ బుద్ధికి పదునుపెడుతూ పోవాలి. కుటుంబ వాతావరణంలో తనకు లభించిన సంస్కారానికి, బయట గురువుల వల్ల, బంధుమిత్రుల వల్ల, సమాజం వల్ల లభించిన సంస్కారాన్ని జోడిస్తూ ఉన్నత విలువలతో తన ఎదుగుదల కొనసాగేలా చూసుకోవాలి.
ఇలా ఎదుగుతున్న దశలోనే మాతృభాష మీద మంచి పట్టు సాధించటం.. ఇతర భాషలనూ నేర్చుకునే ప్రయత్నంచేయటం.. వాక్చాతుర్యాలతో వక్తగా రాణించటానికి కృషిచేయటం వంటి వాటిమీద దృష్టిపెట్టి నిరంతరం శ్రమించాలి. ఎందుకంటే ప్రజలకు, నాయకునికి మధ్య వారధిలా ఉపయోగపడేవి మాటలే. తన భావాలను, ఆలోచనలను, ప్రణాళికలను, పథకాలను తన మనసులో నుంచి ప్రజల మనసుల్లోకి ఎక్కేలా చేయాలంటే ఓ అవగాహన, అనుబంధం స్పష్టత ఏర్పడాలంటే మంచి భాష, భావవ్యక్తీకరణ నాయకునికి అవసరం. అవిలేకుండా మిగతా ఎన్ని సామర్థ్యాలున్నా అవేవీ ప్రజల దగ్గరకు చేరవు.. ఫలితాలను ఇవ్వవు.
యువనేత స్థాయికి ఎదిగి.. ఓ పదవికి చేరుకున్నవారు అనుభవంతో అప్పుడు తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన విషయాలు కొన్ని వుంటాయి. ప్రజానాయకుడినిగా జనం ముందు నిల్చొని అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి సినిమా హీరో అంత అందగాడై ఉండాల్సిన అవసరం లేకపోయినా మంచి ఫిజికల్ ఫిట్‌నెస్‌తో కనిపించాల్సిన అవసరం ఉంది. ఫిట్‌నెస్ కోసం యువ నాయకులు యోగా, వ్యాయామం లాంటివి చేయటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, పౌష్ఠికాహారం మితంగా తీసుకోవటంతో పాటు ముఖ్యంగా క్రమశిక్షణ అలవరచుకోవాలి.
మానసిక ఆరోగ్యం కోసం అవినీతికి దూరంగా ఉండటం, ప్రజల బాగు గురించే నిరంతరం ఆలోచించటం, అధికారులు, ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడటం వంటివి చేయాలి. రాజకీయ రంగం అన్న తర్వాత కొద్దోగొప్పో రాజకీయాలు, వ్యూహప్రతివ్యూహాలు, ప్రోటోకాల్స్, ప్రచార ఆర్భాటాలు తప్పవు. అవిలేకుంటే ప్రతిపక్షాల దాడికి, ఎత్తులకు పదవిని బలిపెట్టాల్సి వస్తుంది. ఏదిచేసినా ఆరోగ్యకరమైన వాతావరణంలో రాజ్యాంగానికి లోబడే చెయ్యాలి తప్ప ఆ గీతను కొంచమైనా దాటకూడదు. ఒక యువనేత ఇలా తన సామర్థ్యాన్ని, సుపరిపాలనను నిరూపించుకోగలిగితే ఆ ఛరిష్మా చూసి మరెంతోమంది యువ నేతలు ముందుకొస్తారు.