
రాజంపేట్ మండలంలోని అర్గోండ గ్రామంలో అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాజశేఖర్ ( 27 ) గతంలో జీవనోపాధి కొరకు అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి హైదరాబాదులో ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ గురువారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని కనిపించగా స్థానికులు గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్ప రాజ్ తెలిపారు.