
ఇంటి పనులు అన్ని తానై చేస్తున్నానని, బైకు కొనివ్వలేదని జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్వాయిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన ఒంటరి నవీన్ 23 గత 20 సంవత్సరాల క్రితం సదాశివ నగర్ నుండి ఉప్పల్వాయి ఒంటరి భూపతిరెడ్డి ఇంటికి దత్తపుత్రునిగా వచ్చాడు. గత నాలుగు సంవత్సరాల క్రితం తల్లి చనిపోవడంతో, ఇంటి పనులన్నీ కుమారుడే చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు తండ్రి పొలం వద్దకు కాపాల వెళ్లి, ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పెట్టుకొని, ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి భూపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.