– యువతి మెడపై కత్తితో దాడి..
– ఆపై తాను ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని కూకట్‌పల్లి విజయనగర్ కాలనీలో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. సీఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా ఖాజీపేట పట్టణ ప్రాంతానికి చెందిన రాజు నగరానికి వచ్చి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఓ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న యువతిని ప్రేమించాలని వెంటబడ్డాడు. ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం కూకట్‌పల్లి విజయనగర్ కాలనీలో యువతి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడపై రాజు కత్తితో దాడి చేశాడు. దాంతో తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలిపోయింది. అనంతరం రాజు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిద్దరినీ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ క్రాంతి కుమార్ తెలిపారు.