ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

– రేషన్‌కార్డుల వేలిముద్రలు సమయం పొడిగించాలి
– సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య
నవతెలంగాణ-గజ్వేల్‌
గజ్వేల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా మండలం, మున్సిపల్‌ కేంద్రాల్లో ఆధార్‌ కేంద్రాలను పెంచాలని, రేషన్‌ కార్డుల వేలిముద్రల గడువు పెంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య డిమాండ్‌ చేశారు. రెండు నెలలుగా 10 సంవత్సరాలలోపు పిల్లలకు వేలిముద్రలు కావాలని, చిరునామా మార్చాలని ఆధార్‌ కేంద్రాల వద్దకు తిరిగినా కాలయాపన చేస్తున్నారని అన్నారు. పరిమితమైన ఆధార్‌ కేంద్రాలు ఉండడం వలన వేలాది మంది ప్రజలు ఆధార్‌ కార్డులను పట్టుకొని మున్సిపల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ తదితరుల కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని, అయినా సమయం సరిపోవడం లేదని అన్నారు. ఆధార్‌ కేంద్రాన్ని నిర్వాహకులు రోజు యాభైకి మించి చేయకపోవడం సాఫ్ట్వేర్‌ సమస్యల తలెత్తడం అనేక కారణాల రీత్యా చాలా మంది ప్రజలు బాల బాలికలు తమ ఆధార్‌ కార్డును అప్డేట్‌ చేసుకో లేకపోతున్నారని అన్నారు. వేలిముద్రలు లేకుంటే వచ్చే నెల నుండి బియ్యం అని రేషన్‌ షాప్‌ యజమానులు చెప్పడంతో ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రజల సౌకర్యార్థం ప్రతి మండల కేంద్రంలో మున్సిపల్‌ పట్టణాల్లో మరిన్ని ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్‌ కార్డులను అప్డేట్‌ చేయాలని రేషన్‌ కార్డుల వేలిముద్రలు సమయం ఆరు నెలల వరకు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.