– ఇక్కడ ఏదీ ఉచితం కాదు…
– మొదట ఫ్రీ…ఆ తర్వాత చార్జీల బాదుడు
– ఆన్‌లైన్‌లో ఫ్రీ అంటూ…సర్వీస్ చార్జి పేరుతో మళ్లీ వసూళ్లు
– కోట్లాదిమంది ప్రజల్ని దోచేస్తున్న మోడీ సర్కార్
రిలయన్స్ ఫోన్ల దందా గుర్తుందా? నూనె ప్యాకెట్ కొంటే మోబైల్ ఫోన్ ఫ్రీ… సూపర్ మార్కెట్లో బిల్లు చేస్తే మోబైల్ ఫ్రీ…పెట్రోల్ పోయించుకుంటే మోబైల్ ఫ్రీ….రిలయన్స్ సంస్థ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు ప్రజలకు ముందు ‘ఉచితం’ అంటూ ఎరవేసి, వారికి ఆ ఫోన్లు అలవాటయ్యాక, ఇప్పుడు టారిఫ్ రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచేసి, జనం జేబుల్ని లూటీ చేస్తున్న విషయం స్ఫురణకు వస్తున్నదా? గతంలో ఔట్ గోయింగే కాదు…ఇన్ కమింగ్‌కూ చార్జీ పడేది. ఇప్పుడు అసలు ఫోన్ ఆన్ అవ్వాలన్నా రీచార్జి చేసుకోవాల్సిందే. ఆధార్ గురించి చెప్తూ…ఇప్పుడీ ఫోన్ల గోల ఎందుకనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అచ్చం రియలన్స్ ఫోన్ల తరహాలోనే ఆధార్ దందా చేస్తున్నది. అప్పట్లో ఆధార్ కార్డు ఉచితం అనీ, అది ఉంటే జనం ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేస్తుందనే రకరకాల పుకార్లతో ప్రజల్ని ఆధార్ కార్డు తీసుకొనేలా ప్రోత్సహించింది. ఇప్పుడు అదే ఆధార్ కార్డులో ఏ చిన్న కరెక్షన్ చేసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యునిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐఏఐ) ప్రజల ముక్కు పిండి పైసలు వసూలు చేస్తున్నది. పైపెచ్చు చార్జీలనూ తన ఇష్టం వచ్చినట్టు పెంచేసి, జనం జేబులకు చిల్లు పెడుతున్నది.
ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
దేశంలోని 143.71 కోట్ల మంది ప్రజలకు ఆధార్ కార్డును (అ)నిత్యవసరంగా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ కార్డు ద్వారా ప్రజలతో వ్యాపారం చేస్తున్నది. అన్ని ప్రభుత్వ పథకాలు, ఆర్థిక లావాదేవీల్లో ఆధార్ తప్పనిసరి. చివరకు ఆహార భద్రతా కార్డులు మొదలు ఆస్తుల అమ్మకం, కొనుగోళ్ళు కూడా ఆధార్ లేకుండా జరిగే పరిస్థితి లేదు. తెలంగాణలో ఇటీవల ‘మహాలక్ష్మి’ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. దీనికి ఆధార్ కార్డును ప్రామాణికంగా నిర్ణయించారు. అయితే అప్పుడెప్పుడో పదేండ్ల క్రితం దిగిన ఆధార్ కార్డులు చెల్లవనీ, కొత్తగా కార్డుల్ని అప్‌డేట్ చేసుకోవాలని చెప్పారు. దీనితో ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లతో మహిళా ప్రయాణీకుల గొడవలు అన్నీ ఇన్నీ కావు. దీనిపై మహిళలు ఆధార్ అప్‌డేట్ కోసం మీ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల్లో బారులు తీరారు. ఆధార్‌ను సులభతరం చేయడం మానేసి, ఒక దానికి మరో దృవీకరణ పత్రాన్ని ప్రామాణికంగా చేర్చడంతో ప్రజలు వాటికోసం ఎమ్మార్వో ఆఫీసులు, మున్సిపల్ వార్డు కార్యాలయాలు, గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఆధార్‌లో చిరునామా మార్పు చేసుకోవాలంటే ఎమ్మార్వో ఆఫీసు నుంచి నివాస ధృవీకరణ పత్రం తేవాలని షరతు విధించారు. పేరు మార్పు కోసం నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. చనిపోయిన వ్యక్తుల పేర్ల ఆస్తులు ఉంటే, దస్తావేజుల్లో ఉన్న పేరే ఆధార్‌లోనూ ఉండాలనే నిబంధనతో వారసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ పెన్షనర్లూ కష్టాలను ఎదుర్కొంటున్నారు. అప్పుడెప్పుడో ఉద్యోగాల్లో చేరినప్పుడు రాసిన పేర్లతో పోల్చినప్పుడు ఆధార్ కార్డులో ఏ చిన్న అక్షరం తేడా వచ్చినా పెన్షన్‌ను నిలిపివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ”నాపేరు మాధవీ లత. భర్త బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తూ మరణించారు. ఆయన తన ఆఫీసు పత్రాల్లో నామినీ పేరు ‘మాధవి’ అని రాసారట… నా ఆధార్‌కార్డులో మాధవీలత అని ఉంది. దీనితో ఆ కార్డును సరిచేసుకొస్తేనే పెన్షన్ మంజూరు చేస్తామని అధికారులు కొర్రీ పెట్టారు. చాలా సార్లు మీ సేవా కేంద్రానికి వెళ్లాను. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా, రిజెక్ట్ చేస్తున్నట్టే వస్తుంది. దీనితో మీసేవా కేంద్రం వాళ్లుఅమీర్‌పేటలోని యూఐఏఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్తే ఇవాళ రేపు అని మూడు నెలలుగా తిప్పుతున్నారు” అని ఓ బాధితురాలు ‘నవతెలంగాణ’తో వాపోయింది.
ఉచితం లేదు…
ఆధార్ కార్డులో సవరణలు ఏవీ ఉచితం కాదు. అడ్రస్ మార్పు మొదలు, మోబైల్ నెంబర్ యాడ్ చేయించుకున్నా డబ్బులు చెల్లించాల్సిందే. కానీ ఆధార్ వెబ్‌సైట్‌లో మాత్రం కొన్ని రకాల సేవలు ఉచితం అని దర్శనమిస్తున్నాయి. ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే సేవలు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. అయితే ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తుల్లో 60 శాతానికి పైగా రిజెక్ట్ అవుతున్నాయని బాధితులు చెప్తున్నారు. మీ సేవా కేంద్రమైనా, ఆన్‌లైన్ అయినా ఒకసారి దరఖాస్తు చేసినప్పుడు అది రిజెక్ట్ అయితే, మరోసారి దరఖాస్తు చేసుకుంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సిందే. ఈ విధంగా కుటుంబసభ్యుల ఆధార్ కరెక్షన్స్ కోసం వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని రుత్విక్ అనే యువకుడు వాపోయాడు.
చార్జీల పెంపు
గతంలో ఆధార్ కార్డు నమోదు సమయంలో కేవైసీ చేసుకోవాల్సి వస్తే రూ.30 చార్జి చేసేవారు. ఆ మధ్య దాన్ని రూ.50కి పెంచారు. తాజాగా ఈ చార్జీని రూ.100కి పెంచారు. చిరునామా మార్పు, పుట్టిన తేదీ, పేరు మార్పు, ఫోన్ నెంబర్ మార్పులు వంటి సేవలకు ఆధార్ వెబ్‌సైట్ ద్వారా స్వయంగా చేసుకుంటే రూ.50 చెల్లించాలి. మీసేవా ప్రయివేటు ఫ్రాంచైజ్ కేంద్రాల్లో ఈ చార్జీలను ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. జనాభా నవీకరణ (డెమోగ్రఫిక్ అప్‌డేట్) పేరుతో ఫోటో గుర్తింపు, బయోమెట్రిక్, ఐరిస్ వంటి సేవల చార్జీని రూ.100కి పెంచారు. ఈ సేవలన్నీ ఒకేసారి అప్‌డేట్ కావు. డెమోగ్రఫిక్ అప్‌డేట్ అయ్యేందుకు కనీసం 15 రోజలు సమయం పడుతుంది. ఆ తర్వాత మళ్లీ డబ్బు చెల్లించి, అడ్రస్ మార్పు, మొబైల్ నెంబర్ కూర్పు వంటి సేవల్ని పొందాల్సి ఉంటుంది. దీనితో ప్రజలు పలుమార్లు యూఐఏఐకి డబ్బు చెల్లించి, సేవల్ని పొందాల్సి వస్తున్నది. ఏ కారణంగా ఆధార్ అప్‌డేట్ దరఖాస్తు రిజెక్ట్ అయ్యిందో యూఐఏఐ ఎలాంటి వివరణ ఇవ్వట్లేదు. దీనితో తలపట్టుకోవడం, మళ్లీ మళ్లీ డబ్బులు చెల్లించి దరఖాస్తులు చేసుకోవడమే ప్రజలకు సరిపోతుంది. దీనివల్ల సమయంతో పాటు ఆర్థికంగానూ జనం నష్టపోతున్నారు. దేశంలోని ప్రజలందరిదీ ఇదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మితోపాటు గృహలక్ష్మి పేరుతో రెండొందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వంటి అన్ని సేవలకూ ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో ప్రజలకు తిప్పలు తప్పట్లేదు.
కేంద్రాల కుదింపు
కేంద్ర ప్రభుత్వం ఆధార్ కేంద్రాల సంఖ్యను గణనీయంగా తగ్గించేసింది. గతంలో జాతీయ బ్యాంకులు సహా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఉండేవి. తాజాగా వీటన్నింటినీ తీసేసింది. రాష్ట్ర జనాభా 4 కోట్లకు పైగానే ఉంది. వారందరికీ ఆధార్ తప్పనిసరి. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడున్న ఆధార్ నమోదు కేంద్రాలు కేవలం 2,376 మాత్రమే ఉన్నాయి. వీటిలోనూ అన్ని సేవలు ఒకేచోట లభించవు. డెమోగ్రఫిక్ అప్‌డేట్స్ ఒక చోట ఉంటే, ఎన్‌రోల్‌మెంట్, కరెక్షన్స్ వంటి సేవలు మరోచోట ఉన్నాయి. ఏ ఆధార్ కేంద్రానికి వెళ్లినా వందల్లో ప్రజలు క్యూలైన్లలో కనిపిస్తున్నారు.
అంతా ఉత్తిదే…
తాజాగా ఆధార్ వెబ్‌సైట్‌లో 2024 మార్చి 14వ తేదీ వరకు గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు ఉచితంగా అప్‌లోడ్ చేసుకోవచ్చనే ప్రచారం కనిపిస్తుంది. నిజమే అని విశ్వసించి, దానిలో దరఖాస్తు చేస్తే, చివర్లో సర్వీసు చార్జీ కింద రూ.50 చెల్లించమని చెప్తుంది. డబ్బు వసూలు చేస్తూ ఉచితం అని ఎలా ప్రచారం చేసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇష్టారాజ్యం
ఆధార్ విధివిధానాల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. 0-5 సంవత్సరాల్లోపు చిన్న పిల్లలకు ఆధార్ ఉచితంగా ఇచ్చేవారు. అలాగే 15 సంవత్సరాలలోపు యువతీయువకులు తమ ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకొనేందుకు కూడా సేవల్ని ఉచితంగా అందించేవారు. ఇప్పుడు ఏవీ ఉచితం కాదు. సర్వీస్ చార్జీల పేరుతో అన్ని సేవల్ని డబ్బులు చెల్లించి కొనుక్కోవల్సిందే!
కోట్ల రూపాయలు వసూలు
ఆధార్ కరెక్షన్స్ పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నది. ప్రతి ఏడాదీ ఈ దోపిడీ రెట్టింపే అవుతున్నది. 2009-10 నుంచి 2021-22 వరకు యూఐఏఐ (ఆధార్) వార్షిక లెక్కల్లో ఆదాయం గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఆధార్ సేవల ద్వారా యూఐఏఐకి వచ్చిన ఆదాయం అక్షరాలా రూ.387.41 కోట్లు. 2009-10లో ఈ సంస్థ చేసిన ఖర్చు కేవలం రూ.26.21 కోట్లే. ఇదీ ఆధార్ దోపిడీ.