8 నుంచి ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ

న్యూఢిల్లీ: ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) మే 8 నుంచి ప్రారంభం కానుందని ఆ సంస్థ తెలిపింది. 10న ముగియనున్న ఈ ఇష్యూలో రూ.3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్దేశించుకుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 7న ఇష్యూ ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ వివరాలను గురువారం బ్లాక్‌స్టోన్‌ సీనియర్‌ అధికారులు అమిత్‌ దీక్షిత్‌, ముకేశ్‌ మెహతా, ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ రిషి ఆనంద్‌ మీడియాకు వెల్లడించారు. ఈ ఇష్యూలో భాగంగా రూ.1,000 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో ప్రమోటరు బీసీపీ టోప్కో 7 పీటీఈ లిమిటెడ్‌ రూ.2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ గ్రూపునకు చెందిన బీసీపీ టోప్కోకు 98.72 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌కు 1.18 శాతం చొప్పున వాటాలున్నాయి.