ఆధార్ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.. ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా ఆధార్ ఉండాల్సిందే. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ ఆధార్ విషయంలో బాధితులుగానే ఉంటున్నారు. వేలి ముద్రలు పడలేదని, ఈకేవైసీ కాలేదని ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డులో చిరునామా మార్చాలి.. పేరులో దొర్లిన చిన్న తప్పును సవరించాలి.. ఇతర డాక్యుమెంట్లలో ఉన్న విధంగా పుట్టిన తేదీ సరిచేయాలి.. సాధా రణం గానైతే ఇందుకు పెద్దగా సమయం పట్టదు. అధీకృత ఆ ధార్ కేంద్రానికి వెళ్తే ఒక గంటలోనే అయిపోయేపని. అదే ఆన్ లైన్‌లో అయితే అంత సమయం కూడా పట్టదు. వాటి సంఖ్య తక్కువగా ఉండడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అవస్థలు పడు తున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆధార్ కేంద్రాలు మూత పడిపోయాయి. దీంతో ఆధార్ చేర్పులు మార్పులకు అష్టకష్టాలు పడుతున్నారు. దిక్కుతోచక తిరుగుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.
కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తం పథకాలకు, ముఖ్యంగా రూ.500లకే గ్యాస్, రేషన్‌కార్డు, మహిళల ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటికి ఆధార్ కార్డు ను తప్పని సరిచేయడంతో గత నెలరోజులుగా ఆధార్ కేంద్రాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. కాగా, విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలన్నా ఇది కావాల్సిందే. ఒకసారి ఆధార్ పొందినవారు అందులో వివరాలను మార్చుకునే అవకాశం ఉంది. గతంలో అ న్ని మీసేవ కేంద్రాలు, అధీకత ఆధార్ కేంద్రాల్లో కొత్త ఆధార్ కా ర్డుల జారీ, సవరణలకు అవకాశం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అ న్ని చోట్ల మీసేవ కేంద్రాలు ఉండటంతో సవరణలు అప్పటిక ప్పుడే జరిగిపోయేవి. అయితే, విదేశీయులు సైతం ఆధార్ పొం దతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రత్యా మ్నాయాలను ఆలోచించకుండా ఏకపక్షంగా నియంత్రణ చర్యలు చేపట్టింది.
ఎప్పుడో పదేండ్ల కిందట తీయించుకొన్న ఆధార్ కార్డును ప్రభుత్వ అధికారులకు సమర్పిస్తుంటే ఆన్‌లైన్‌లో చూసి ఆధార్ అప్‌డేట్ కాలేదంటూ పంపించి వేస్తున్నారు. ఆధార్‌కార్డుల్లో కు టుంబ సభ్యుల మార్పులు, చేర్పులు, ఫోన్ నెంబరు లింకేజీ, ఈకే వైసీ చేయించుకోవడం వంటివి ప్రజలకు కష్టతరంగా మారింది. రేషన్‌కార్డులో కూడా కుటుంబసభ్యులు ఈకేవైసీ చేయించుకో వాలని, చేయించుకుంటేనే వారి పేర్లు అందులో ఉంటాయని, లేనివారివి కట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దానికి ఈ నెల గడువుగా ఉందని లేదంటే కార్డు రద్దవుతుందనే ప్రచా రం కూడా జరుగుతోంది. దీనికి తోడు మహాలక్ష్మి పథకంలో భాగంగా చేపట్టిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా అక్కడక్కడ పలువు రిని ఇక్కట్లకు గురి చేస్తోంది. ఒరిజినల్ ఆధార్‌ను చూపిస్తేనే ఉచిత టికెట్ ఇస్తున్నారు. లేదంటే ఛార్జీలు వసూలు చేస్తు న్నారు. చిన్నారులకు ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఆధార్‌లో ఫొటో లు ఆప్‌డేట్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా అప్‌డేట్ చేసినవే బస్సుల్లో చెల్లుతున్నాయి. దీంతో లబ్దిదారుల రద్దీ బాగా పెరిగి పోయింది. ఉదయం తొమ్మిదిగంటలకు తెరిచే ఆధార్ కేంద్రం వద్ద ఆరుగంటల నుంచే వందలాది మంది గుమిగూడుతు న్నారు. ఎముకలు కొరికే చలిలోనూ అర్ధరాత్రి ఆ కేంద్రాల వద్ద బయటే నిద్రిస్తున్నారు. ఇలా రోజంతా ఆధార్‌కేంద్రాల వద్ద పడి గాపులు పడుతున్నా ఆ సేవలందేది కొద్దిమందికి మాత్రమే. దీంతో లబ్ధిదారులు ఏమి చేయాలో తోచక అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహ కులు కూడా వారికి సర్దిచెప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. గ్రామాల్లోనైతే ఆధార్ అవస్థలు అధికం. ఆన్‌లైన్ సెంటర్లు లేక, సరైన అవగాహన ఉన్న వారు లేక పరిస్థితి మరింత దీనంగా తయారైంది. ఆధార్ నాట్ మ్యాచ్‌డ్ అని వస్తుండటంతో బెంబేలెత్తుతున్నారు. ఎవరిని అడగాలో, ఏం చేయాలో తెలియక ఆగ్రహానికి గురవుతున్నారు. అక్కడక్కడ ఆధార్ కేంద్రాలని ర్వాహకులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా రోజూ రాష్ట్రంలో ఏదో ఒక మూలన చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
గతంలో 1800 ఆధార్ సవరణ కేంద్రాలు ఉంటే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అవి 700లకు కుదించుకుపోయాయి అదీ ప్రభుత్వ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ కేం ద్రాల నిర్వహణకు కేంద్రం మోకాలడ్డుతోంది. చిన్నపాటి తప్పుల ను కూడా భూతద్దంలో చూపుతూ ఈ కేంద్రాల అను మతులను యూఐడీఏఐ వాటిని డీయాక్టివేట్ చేస్తోంది. ఇలా రాష్ట్రంలో ప్ర తి నెలా 25-30 ఆధార్ కేంద్రాలను తొలగిస్తుండటంతో వీటి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స వరణలకు అందుబాటులో ఉన్న కేంద్రాలు 350లోపే.. వీటిలో దాదాపు 150 వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం పోస్టాఫీసులు, బ్యాంకులు, ప్రభుత్వ బడుల్లో కొన్ని ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారని చెబుతున్నా.. ఎక్కడా అవి ప ని చేస్తున్న దాఖలాలు లేవు. నెట్‌వర్క్, సర్వర్ సమస్యలంటూ రో జుకు నాలుగైదు కంటే ఎక్కువ దరఖాస్తులు తీసుకోవడం లేదు.
గతంలో ప్రజల సౌకర్యార్థం స్లాట్ బుకింగ్‌కు ఏర్పాటు చేసిన మాదాపూర్, మూసారాంబాగ్ ఆధార్ కేంద్రాల్లో నెలక్రితం ఆ విధా నాన్ని అకస్మాత్తుగా రద్దు చేశారు. వాస్తవానికి మీసేవ కేంద్రాల నుంచి ఆధార్ సేవలను తొలగిస్తూ మూడేండ్ల క్రితం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచే మిగతా కేంద్రాల వద్ద రద్దీ పెరిగిపోయింది. ఆధార్ కేంద్రాలను పెంచాలని, మరిన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ కేంద్రాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉ న్నామని రెండేండ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిం ది. అయినా దానికి అతీగతి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ పథకాలు ప్రజలకు చేర్చడం కోసమైనా చొరవ చేసి ఆధార్ కేంద్రాలు పెంచేందుకు కృషి చేయాలి. ప్రజల కష్టాలు తీర్చాలి.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897065417