– పలువురు నేతల అరెస్టు
– ఎక్కడికక్కడ ఆంక్షలు, బందోబస్తు ఏర్పాట్లు
– పోలీసు రాజ్యంగా మార్చేసారంటూ ఆప్ విమర్శలు
– 31న మెగా ర్యాలీ ఏర్పాటుకు సన్నాహాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆప్ నేతలు, కార్యకర్తలు మంగళవారం వీధుల్లోకి వచ్చారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘కేజ్రీవాల్ జిందాబాద్’ అని నినాదాలు చేసుకుంటూ లోక్ కల్యాణ్ మార్గ్‌లో గల ప్రధాని నరేంద్ర మోడీ నివాసం దిశగా ప్రదర్శనగా రావడానికి వారు ప్రయత్నించడంతో పటేల్ చౌక్ వద్ద వారిని నిలిపివేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని నగరాన్ని ఢిల్లీ పోలీసులు మొత్తగా పోలీసు రాజ్యంగా మార్చివేశారని ఆప్ ఢిల్లీ శాఖ కన్వీనర్, మంత్రి గోపాల్ రారు విమర్శించారు. ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, నగరవ్యాప్తంగా 144వ సెక్షన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూస్తుంటే ఇది పోలీసు రాజ్యంగా వున్నట్టు అనిపిస్తోందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమించే వారు దేశంలోని నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతునాన్నరని రారు పేర్కొన్నారు. మార్చి 31న ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో మహా ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మెగా నిరసనలను నిర్వహించనున్నట్టు రారు తెలిపారు.
ఈ ర్యాలీలో లక్షలాదిమంది ప్రజలు పాల్గొంటారని, ఇండియా బ్లాక్ నుంచి పలువురు నేతలు హాజరవుతారని చెప్పారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ వారందరూ తమ గళాన్ని వినిపిస్తారని చెప్పారు. ఆప్ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో ప్రధాని నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని మెట్రో స్టేషన్ల వద్ద బందోబస్తు పెంచారు. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్‌కు వెళ్ళే, వచ్చే మార్గాలను భద్రతా కారణాల రీత్యా మూసివేసినట్లు ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎక్స్‌లో తెలిపింది. అలాగే పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ల వద్ద కూడా రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఏ తరహా నిరసనలు నిర్వహించడానికి కూడా అనుమతినివ్వలేదని డీసీపీ(న్యూఢిల్లీ) దేవేశ్ కుమార్ తెలిపారు. కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సీనియర్ ఆప్ నేతలు సోమ్‌నాథ్ భారతి, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖి బిర్లా, పంజాబ్ మంత్రి హర్‌జోత్ సింగ్ బైన్స్ తదితరులు వున్నారు. అవినీతికి పాల్పడిన కవితను కాపాడేందుకు నిజాయితీగా వున్నవారిని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని ఆందోళనకారుల్లో ఒకరు విమర్శించారు.
శాంతియుతంగా నిరసన తెలియ చేస్తున్న ఆప్ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆప్ సీనియర్ నేత సోమ్‌నాథ్ భారతి వ్యాఖ్యానిం చారు. ఎక్స్‌లో పోస్టు పెడుతూ, తనతో పాటు డిప్యూటీ స్పీకర్ రాఖి బిర్లా తదితరు లను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మార్చి 28 వరకు రిమాం డ్‌కు పంపింది. ప్రస్తుతం రద్దైన ఈ విధానం లో సూత్రధారి, కీలక కుట్రదారుడు కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపించింది. కాగా కేజ్రీవాల్ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తు న్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో అవకతవకలకు పాల్పడుతోందని విమర్శించారు.
కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా స్పందించింది. సక్రమమైన, పారదర్శకతతో కూడిన విచారణా క్రమాన్ని చేపట్టగలరని తాము ఆశిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. ఈ మెయిల్‌లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి పై రీతిన స్పందించారు. గతంలో జర్మనీ కూడా ఇదే రీతిలో స్పందించడంతో భారత్ తీవ్రంగా మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాగలదని తీవ్రంగా స్పందించింది. జర్మనీ రాయబారిని పిలిచి తమ నిరసన తెలియచేసింది. అది జరిగిన రెండు రోజులకే అమెరికా కూడా ఇదే రీతిలో స్పందించింది. సకాలంలో విచారణ జరగాలని ఆశిస్తున్నట్టు తెలిపింది.