ఆశాల భారీ ధర్నా

Aashala's massive dharna– కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్‌ ఆఫీస్‌ ముట్టడి
– ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18వేలు ఇవ్వాలి
– పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బీమా, రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ వర్తింపజేయాలి: తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు జయలకిë
– సమ్మె తాత్కాలికంగా వాయిదా
– నేటి నుంచి విధుల్లోకి ఆశాలు
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం 33 జిల్లాల నుంచి ఆశా వర్కర్లు వేలాదిమంది హైదరాబాద్‌లోని ఆరోగ్య శాఖ కమిషనర్‌ ఆఫీస్‌ ముట్టడికి తరలివచ్చారు. కోఠి ఉమెన్స్‌ కళాశాల చౌరస్తా వద్ద రోడ్డుపై పెద్దఎత్తున బైటాయించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా, రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్‌లు పొందారన్నారు. ఎప్పటికప్పుడూ ప్రజలకు అనేక సేవలందిస్తున్నారని తెలిపారు. అయితే, పనికి తగిన పారితోషికాలు లేక.. కనీస వేతనం ఇవ్వక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు చర్చలకు పిలిచి ఆశా వర్కర్ల సమస్యలపై కమిటీ వేశామని, ఆ కమిటీలో ఆశా వర్కర్ల నుంచి ఒకరిని తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని డీహెచ్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయినందున తమ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు జయలక్ష్మి ప్రకటించారు. మంగళవారం నుంచి ఆశా వర్కర్లు విధుల్లో చేరుతున్నారన్నారు. ఈ ఆందోళనలో రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.నీలాదేవి, కోశాధికారి పి.గంగామణి, సిటీ నాయకులు వెంకటేష్‌, మీనా, వేలాదిమంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.