ఆరాంఘర్‌లో దోపిడీ దొంగల బీభత్సం

ఆరాంఘర్‌లో దోపిడీ దొంగల బీభత్సం– సెక్యూరిటీ గార్డును చంపి ఇనుప రాడ్లు ఎత్తుకెళ్లిన దుండగులు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్‌లో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సెక్యూరిటీ గార్డును చంపి ఇనుప రాడ్లు ఎత్తుకెళ్లిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరాంఘర్‌ చౌరస్తాలో మహబూబ్‌ అనే వ్యక్తి ఇనుప రాడ్ల గోదాముని ఏర్పాటు చేశారు. గోదాంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్‌(25) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి గోదాంకు తాళం వేసి మహబూబ్‌ వెళ్లిపోయాడు. అందులో ఒక గదిలో సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉన్నాడు. బుధవారం ఉదయం గోదాంకు వచ్చిన మహబూబ్‌ తాళాలు పగలగొట్టి ఉండటం, లోపలికి వెళ్లి చూడగా ఆసిఫ్‌ రక్తం మడుగులో చనిపోయి ఉన్న దృశ్యం కనిపించింది. గోదాంలో ఉన్న సీసీ కెమెరాలు కనిపించలేదు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. దుండగులు మొదటగా గుర్తుపట్టకుండా ఉండడానికి సీసీ కెమెరాలు పూర్తిగా ధ్వంసం చేసి వారి వెంట తీసుకెళ్లారు. దొంగతనానికి వచ్చిన దుండగులను సెక్యూరిటీ గార్డు ఆసిఫ్‌ ఆపడంతో అతడిపై విచక్షణరహితంగా దాడి చేసి కొట్టి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అదే రహదారిపై ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.