– ఏటీఎం డోర్ కత్తిరించి చోరీ
నవతెలంగాణ-బాల్కొండ
ఏటీఎంను కత్తిరించి అందులోని రూ.24,92,600 నగదును దోచేసిన ఘటన బాల్కొండలో జరిగింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి ఒక తెల్లని కారులో వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఏసీపీ బస్వారెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల మధ్య ఒక కారు ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగి ఏటీఎం దగ్గరకు వచ్చి సీసీ కెమెరాకు బ్లాక్ పెయింట్స్ స్ప్రే చేశాడు. మరో వ్యక్తితో కలిసి ఏటీఎంలోకి గ్యాస్ కట్టర్ తీసుకెళ్లి ఏటీఎం డోర్ కత్తిరించారు. అనంతరం ఏటీఎం బాక్స్‌లోని నగదును దొంగిలించారు. ఇదంతా కేవలం 9 నిమిషాల్లోనే జరిగినట్టు ఏటీఎం వద్ద ఉన్న మరో సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. ఏటీఎం ఛానల్ మేనేజర్ అవధూత నితిన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బాల్కొండ ఏఎస్‌ఐ శంకర్ తెలిపారు.