కొత్తగా పాసుబుక్ వచ్చిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు మాత్రమే రైతు బీమాకు ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త పట్టాదారు రైతులకు జూన్ 28 వరకు పట్టా పాస్ బుక్ వచ్చి ఉండాలని, ఇంతవరకు కూడా రైతు బీమా చేసుకోకపోయినా రైతులు మాత్రమే రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు బీమాకు దరఖాస్తులు చేసుకునేందుకు దరఖాస్తు ఫారంతో పాటు రైతు పట్టా దారు పాస్ బుక్ (లేదా), తహసిల్దార్ తో డిజిటల్ సంతకం అయినా డిఎస్ పేపర్, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జత చేయాలన్నారు. నామిని మైనర్ అయితే అప్పాయింటి మేజర్ అయి ఉండాలని, వీరి ఇద్దరివీ ఆధార్ కార్డు జిరాక్స్ లు ఏఈఓ సమక్షంలో దరఖాస్తు మీద సంతకం చేసి ఇవ్వాలని తెలిపారు.14 ఆగస్టు 1965 నుండి 14 ఆగస్టు 2006 మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమాకి అర్హులని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాలు వయస్సు ఉన్న రైతులు మాత్రమే బీమా చేసుకోవాలని సూచించారు.గతంలో బీమా చేసుకున్నా రైతులు బీమాలో మార్పులు చేర్పులు, ఆధార్ లో లేదా నామిని చనిపోతే మార్పులు కొరకు మాత్రం జూలై 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో వివరించారు.