అభిషేక్‌ అదరహో

– 46 బంతుల్లోనే 100 బాదిన చిచ్చరపిడుగు
– శివమెత్తిన రుతురాజ్‌, రింకూ సింగ్‌
– స్పిన్‌, పేస్‌కు జింబాబ్వే విలవిల
– 100 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం
భారత చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐపీఎల్‌లో ప్రపంచ శ్రేణి పేసర్లను చితక్కొట్టిన చిన్నోడు.. హారారేలో జింబాబ్వే బౌలర్లను హడలెత్తించాడు. 46 బంతుల్లోనే శతకబాదిన అభిషేక్‌ వర్మ (100) హ్యాట్రిక్‌ సిక్సర్లతో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (77), రింకూ సింగ్‌ (48) సైతం మెరవటంతో తొలుత భారత్‌ 234 పరుగుల భారీ స్కోరు చేసింది. బౌలర్లు సమిష్టిగా చెలరేగటంతో ఛేదనలో జింబాబ్వే 134 పరుగులకే చేతులెత్తేసింది. 100 పరుగుల తేడాతో భారత్‌ ఏకపక్ష విజయం సాధించింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
నవతెలంగాణ-హరారే
కుర్రాళ్లు ప్రతీకార పంజా విసిరారు. తొలి టీ20లో అనూహ్యంగా తడబాటుకు గురైన శుభ్‌మన్‌ గిల్‌ సేన.. మరుసటి రోజే పసికూనపై ప్రతాపం చూపించింది. బ్యాట్‌తో, బంతితో తిరుగులేని ప్రదర్శన చేసిన భారత్‌ 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అభిషేక్‌ శర్మ (100, 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) ధనాధన్‌ సెంచరీతో చెలరేగాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (77 నాటౌట్‌, 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), రింకూ సింగ్‌ (48 నాటౌట్‌, 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. టాప్‌-4 బ్యాటర్లు రాణించటంతో భారత్‌ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. రికార్డు ఛేదనలో జింబాబ్వే తేలిపోయింది. భారత పేసర్లు అవేశ్‌ ఖాన్‌ (3/11), ముకేశ్‌ కుమార్‌ (3/37) సహా స్పిన్నర్‌ రవి బిష్ణోరు (2/11) మాయజాలంతో జింబాబ్వే విలవిల్లాడింది. 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. వెస్లీ (43, 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), ల్యూక్‌ జాంగ్వే (33, 26 బంతుల్లో 4 ఫోర్లు), బ్రియాన్‌ బెనెట్‌ (26, 9 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) రాణించారు. శతక వీరుడు అభిషేక్‌ శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. భారత్‌, జింబాబ్వే మూడో టీ20 బుధవారం హరారే వేదికగా జరుగనుంది.
అభి.. ఆకాశమే హద్దు!: అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌గా నిష్క్రమించిన అభిషేక్‌ శర్మ (100) రెండో టీ20లో తనేంటో చూపించాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (2) నిరాశపరిచినా.. ఓ ఎండ్‌లో పవర్‌ప్లేలో ఓపిగ్గా నిలబడ్డాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఓ సిక్సర్‌, రెండు ఫోర్లు బాదిన అభిషేక్‌.. పవర్‌ప్లేలో నెమ్మదించాడు. గిల్‌ వికెట్‌ అందుకు తోడైంది. దీంతో తొలి ఆరు ఓవర్లలో భారత్‌ 36 పరుగులే చేసింది. వ్యక్తిగత స్కోరు 28 వద్ద అభిషేక్‌కు జీవనదానం లభించింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్న అభిషేక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటి వరకు 24 బంతుల్లో 28 పరుగులే చేసిన అభిషేక్‌.. ఆ తర్వాతి 22 బంతుల్లో ఏకంగా 72 పరుగులు పిండుకున్నాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన అభిషేక్‌.. వంద మార్క్‌ను ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 46 బంతుల్లోనే అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్‌ తరఫున మూడో వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు. మసకద్జ ఓవర్లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో కెరీర్‌ తొలి సెంచరీ పూర్తి చేసిన అభిషేక్‌.. క్రీజులో ఉన్నంతసేపు సునామీ సృష్టించాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (77 నాటౌట్‌), రింకూ సింగ్‌ (48 నాటౌట్‌) ఆరంభంలో నెమ్మదిగా ఆడినా.. డెత్‌ ఓవర్లలో దంచికొట్టారు. రింకూ సింగ్‌ సిక్సర్ల వర్షం కురిపించగా.. రతురాజ్‌ బౌండరీలతో దండయాత్ర చేశాడు. ఈ ఇద్దరూ దూకుడు ఆడటంతో భారత్‌ 234 పరుగుల భారీ స్కోరు సాధించింది.
పేస్‌, స్పిన్‌ మాయ: టీ20ల్లో జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచిన టీమ్‌ ఇండియా.. బంతితోనూ ఆ జట్టు అదే స్థాయిలో వణికించింది. పేసర్లు ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌లు ఆరు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్‌ రవి బిష్ణోరు రెండు వికెట్లతో మాయ చేశాడు. దీంతో 18.4 ఓవర్లలోనే జింబాబ్వే కుప్పకూలింది. 134 పరుగులకే పరిమితమైన ఆతిథ్య జట్టు.. 100 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. జింబాబ్వే తరఫున ఓపెనర్‌ వెస్లీ (43), బ్రియాన్‌ బెనెట్‌ (26) టాప్‌ ఆర్డర్‌లో ఆకట్టుకున్నారు. లోయర్‌ ఆర్డర్‌లో ల్యూక్‌ జాంగ్వే (33) జింబాబ్వేకు మూడెంకల స్కోరు అందించేందుకు చెమటోడ్చాడు. ఇన్నోసెంట (0), మేయర్స్‌ (0), క్లైవ్‌ (0)లు పరుగుల ఖాతా తెరువకుండానే నిష్క్రమించారు. కెప్టెన్‌ సికిందర్‌ రజా (4) తేలిపోయాడు.
స్కోరు వివరాలు:
భారత్‌ ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (సి) బెనెట్‌ (బి) ముజరబాని 2, అభిషేక్‌ శర్మ (సి) మేయర్స్‌ (బి) మసకద్జ 100, రుతురాజ్‌ గైక్వాడ్‌ నాటౌట్‌ 77, రింకూ సింగ్‌ నాటౌట్‌ 48, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 234.
వికెట్ల పతనం: 1-10, 2-147.
బౌలింగ్‌: బ్రియాన్‌ బెనెట్‌ 2-0-22-1, బ్లెసింగ్‌ ముజరబాని 4-1-30-1, తండారు చతార 4-0-38-0, సికిందర్‌ రజా 3-0-34-0, ల్యూక్‌ జాంగ్వే 4-0-53-0, మేయర్స్‌ 1-0-28-0, మసకద్జ 2-0-29-1.
జింబాబ్వే ఇన్నింగ్స్‌: ఇన్నోసెంట్‌ (బి) ముకేశ్‌ కుమార్‌ 4, వెస్లీ (బి) రవి బిష్ణోరు 43, బ్రియాన్‌ బెనెట్‌ (బి) ముకేశ్‌ కుమార్‌ 26, మేయర్స్‌ (సి) రింకూ సింగ్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 0, సికిందర్‌ రజా (సి) జురెల్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 4, కాంప్‌బెల్‌ (సి) రవి బిష్ణోరు (బి) వాషింగ్టన్‌ 10, క్లైవ్‌ (ఎల్బీ) రవి బిష్ణోరు 0, మసకద్జ రనౌట్‌ 1, ల్యూక్‌ జాంగ్వే (సి) గైక్వాడ్‌ (బి) ముకేశ్‌ కుమార్‌ 33, బ్లెస్సింగ్‌ (సి) వాషింగ్టన్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 2, చతార నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (18.4 ఓవర్లలో ఆలౌట్‌) 134.
వికెట్ల పతనం: 1-4, 2-40, 3-41, 4-46, 5-72, 6-73, 7-76, 8-117, 9-123, 10-134.
బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 3.4-0-37-3, అభిషేక్‌ శర్మ 3-0-36-0, అవేశ్‌ ఖాన్‌ 3-0-15-3, రవి బిష్ణోరు 4-0-11-2, వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-28-1, రియాన్‌ పరాగ్‌ 1-0-5-0.