అభిషేక్‌ అదరహో

Abhishek Adaraho– 54 బంతుల్లో 135 బాదిన శర్మ
– ఐదో టీ20లో భారత్‌ ఘన విజయం
– 4-1తో టీ20 సిరీస్‌
– ఆతిథ్య జట్టు సొంతం
నవతెలంగాణ-ముంబయి : యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (135, 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్‌లు) ధనాధన్‌ దంచికొట్టాడు. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన అభిషేక్‌ శర్మ వాంఖడెలో ఇంగ్లాండ్‌ బౌలర్లను ఉతికారేశాడు. స్వల్ప స్కోర్లతో సాగిన సిరీస్‌కు ముంబయిలో పరుగుల వరదతో అదిరే ముగింపు అందించాడు. అభిషేక్‌ శర్మ సూపర్‌ షోతో భారత్‌ తొలుత 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ 10.3 ఓవర్లలోనే చేతులెత్తేసింది. ఫిల్‌ సాల్ట్‌ (55, 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిసినా.. బెన్‌ డకెట్‌ (0), జోశ్‌ బట్లర్‌ (7), హ్యారీ బ్రూక్‌ (2), లియాం లివింగ్‌స్టోన్‌ (9), జాకబ్‌ బెతెల్‌ (10), బ్రైడన్‌ కార్సె (3), జెమీ ఓవర్టన్‌ (1) విఫలం అయ్యారు. 97 పరుగులకు ఆలౌట్‌ అయిన ఇంగ్లాండ్‌ 150 పరుగుల రికార్డు తేడాతో పరాజయం పాలైంది. 4-1తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ టీమ్‌ ఇండియా సొంతమైంది. అభిషేక్‌ శర్మ (135, 2/3) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. పరుగుల పరంగా ఇంగ్లాండ్‌కు ఇది టీ20ల్లో అత్యంత దారుణ పరాజయం.
అభిషేక్‌ షో : టాస్‌ నెగ్గి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు అభిషేక్‌ శర్మ (135) చుక్కలు చూపించాడు. 13 సిక్సర్లతో విరుచుకుపడిన అభిషేక్‌ శర్మ 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 17 బంతుల్లో ఫిప్టీ సాధించిన అభిషేక్‌.. ఏ బౌలర్‌ను వదల్లేదు. సంజు శాంసన్‌ (16), సూర్యకుమార్‌ యాదవ్‌ (2), తిలక్‌ వర్మ (24) స్వల్ప స్కోరు వెనుదిరిగినా.. ఓ ఎండ్‌లో బౌలర్ల భరతం పట్టాడు. వాంఖడెలో సిక్సర్ల సునామీ సృష్టించిన అభిషేక్‌ ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్‌ శర్మ (10) రికార్డును బద్దలుకొట్టాడు. టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన శుభ్‌మన్‌ గిల్‌ (126)ను సైతం అభిషేక్‌ వాంఖడెలో దాటేశాడు. అభిషేక్‌ దూకుడు ముంగిట ఇంగ్లాండ్‌ తేలిపోయింది. బౌలింగ్‌ కాంబినేషన్లు మారినా మనోడి ఊచకోత మారలేదు. శివం దూబె (30), అక్షర్‌ పటేల్‌ (15) రాణించారు. హార్దిక్‌ పాండ్య (9), రింకు సింగ్‌ (9) నిరాశపరిచారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు భారత్‌ 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.