ఏపీ విద్యార్థులకు15శాతం కోటా రద్దు చేయండి

– వైద్యారోగ్యశాఖ మంత్రికి జుడా విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ష్ట్రంలో పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ఇచ్చే 15శాతం కోటాను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌(టీజుడా) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును శుక్రవారం కలిసి విన్నవించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు 15శాతం కోటాను రద్దుచేస్తూ ఉత్తర్వులను జారీచేసిందని, అదే తరహాలో తెలంగాణలోనూ 2 జూన్‌ 2014 వరకు అందుబాటులో ఉన్న పీజీ సీట్లకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంటే 200 పీజీ సీట్లు రాష్ట్రం విద్యార్థులకు దక్కుతాయని తెలిపింది. ఈ విషయంపై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీతో మాట్లాడి ఉత్తర్వులు ఇచ్చేవిధంగా చొరవ తీసుకోవాలని కోరింది. మంత్రిని కలిసిన వారిలో టీజుడా అధ్యక్షులు డాక్టర్‌ కౌశిక్‌కుమార్‌ పింజరాల, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్కే అఖిల్‌, ముఖ్యసలహాదారులు డాక్టర్‌ రాజీవ్‌నాయక్‌, డాక్టర్‌ పి.శ్రీనివాస్‌ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.