సీపీఎస్‌ను రద్దు చేయండి

Abolish CPS– 3 లక్షల ఉద్యోగుల కుటుంబాల ఎదురుచూపు
– మంత్రి కేటీఆర్‌కు టీఎస్‌సీపీఎస్‌ఈయూ నివేదిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు దీనికోసం ఎదురుచూస్తున్నాయని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరింది. శనివారం హైదరాబాదులో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌ కలిసి సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం అమలుపై సంపూర్ణ నివేదికను అందించారు. సీపీఎస్‌ రద్దు చేసిన రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ అమలవుతున్న తీరును మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీపీఎస్‌పై సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఏటా రూ.రెండు వేల కోట్లు షేర్‌ మార్కెట్‌లోకి వెళ్తున్నాయని వివరించారు. పాత పెన్షన్‌ అమలు వల్ల ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా భారం ఉండబోదని స్పష్టం చేశారు. సీపీఎస్‌ రద్దుపై ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ కోశాధికారి నరేష్‌గౌడ్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.