– ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలి
– సీఎం, డిప్యూటీ సీఎంకు ఎస్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఎస్టీయూటీఎస్ కోరింది. వినూత్న కార్యక్రమాల పేరుతో పాఠశాలల్లో అమలవుతున్న తొలిమెట్టు, ఉన్నతి వంటి కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల కు పదోన్నతులు వెంటనే కల్పించాలనీ, బదిలీల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఉపాధ్యాయులకు జీతాలు అందలేదని తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలివ్వాలని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని తెలిపారు. అన్ని పాఠశాలల్లోనూ మౌలిక వసతులు కల్పించాలనీ, స్కావెంజర్లను నియమించాలని కోరారు.