ఈవీఎంలను రద్దుచేసి బ్యాలెట్లను పునరుద్ధరించాలి

ఈవీఎంలను రద్దుచేసి
బ్యాలెట్లను పునరుద్ధరించాలి–  కే.శ్యాం ప్రసాద్‌, డైరెక్టర్‌ జనరల్‌ (ఐఐఎస్‌)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు (ఈవీఎం)లను రద్దు చేసి బ్యాలెట్లను పునరుద్ధరించాలని ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ రిటైర్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.శ్యామప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాటి వినియోగంపై సాంకేతికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్లయంలో ఈవీఎంల వినియోగంపై ఎన్నికల సంఘం పునరాలోచించాలని కోరారు. అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు నిరుపేద దేశమైన బంగ్లాదేశ్‌లాంటి చిన్న చితక దేశాలు సైతం బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఈవీఎంలపై వస్తున్న సందేహాలను నివృత్తి చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుందని అన్నారు. దేశంలోని ప్రసిద్ధ ఐఐటీలకు చెందిన సాంకేతిక నిపుణులతో నాణ్యత, భద్రతపై పరీక్ష చేయించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టంలో మార్పులు తేవాలని సూచించారు. వీటి సాధన కోసం
ఈ నెల 31న ఇందిరాపార్కు వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రజాస్వామ్య వాదులు తన ఆందోళనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సురెంద్రనాథ్‌, ఆనందరావు, కార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.