తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను రద్దు చేయండి

– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి డీటీఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను రద్దు చేయాలని డీటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ సంఘం అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి, స్టేట్‌ అకడమిక్‌ సెల్‌ కన్వీనర్‌ బి రామకృష్ణ కలిసి వినతిపత్రం సమర్పించారు. తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను అమల్లో పెట్టేముందు వాటిని ఎక్కడైనా, ఎప్పుడైనా పరీక్షించి లేదా అనుసరించి అనుకున్న లక్ష్యాలను సాధించారా?అని ప్రశ్నించారు. వాటిని భిన్న ప్రాంతాల్లోని భిన్న నేపథ్యమున్న జిల్లాలకు నాలుగైదు బడుల్లో ఒక టర్మ్‌ మొత్తం నిర్వహించాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో మాడ్యుల్స్‌ రూపకర్తలు విధిగా ప్రత్యక్ష బోధనలో రెగ్యులర్‌ ఉపాధ్యాయుల వలె పాల్గొనేలా చూడాలని కోరారు. వాటి అంతిమ ఫలితాల ఆధారంగా తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అప్పటి వరకు తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.