లగచర్ల భూసేకరణ రద్దు అభినందనీయం

– ఈ విజయం ప్రజా విజయం : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వికారాబాద్‌ జిల్లా లగచర్లలో భూసేకరణను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమనీ, ఇది ముమ్మాటికీ ప్రజా విజయం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. బలవంతపు భూసేకరణ నేపథ్యంలో అక్కడ పెద్ద ప్రజా ఉద్యమం జరిగిందనీ, అందులో వ్యవసాయ కార్మిక సంఘం కీలక భూమిక పోషించిందని గుర్తుచేశారు. ఫార్మా కంపెనీలను నిర్మించవద్దు..పచ్చని పొలాలను పాడు చేయొద్దు అని పోరాడి విజయం సాధించామని తెలిపారు. ఈ విజయం స్ఫూర్తితో రానున్న కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను రద్దు చేయడం అభినందనీయమనీ, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ ఇదే చొరవతో ముందుకు రావాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలని విన్నవించారు. రాష్ట్రంలో భూసేకరణ చట్టం-2013ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.