పుట్ట గొడుగులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో అనేక పోషకాలు ఉండడంతో అనేక రోగాలను దూరం చేస్తాయనే పేరుంది. మార్కెట్‌లో షిటేక్, బటన్ మష్రూమ్, పోర్టోబెల్లో, రీషి వంటి రకాల పుట్టగొడుగులు దొరుకుతున్నాయి. ఈ విభిన్నమైన రకాల పుట్ట గొడుగుల్లో విభిన్నమైన ప్రయోజనాలున్నాయి. అయితే ఈ పుట్ట గొడుగులు తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది
పుట్టగొడుగుల్లో యాంటీ యాక్సిడెంట్లు, బీటా-గ్లూకాన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీని కారణంగా ఏదైనా వ్యాధిని తట్టుకొని నిలబడే విధంగా రోగ నిరోధక శక్తి పని చేస్తుంది. ఇందులో లభించే సెలీనియం అనే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని మంటను నివారించడంలో సహాయపడుతుంది.
బరువును తగ్గిస్తుంది..
బరువు తగ్గేందుకు ఫైబర్ అనేది ప్రధాన మూలకంగా పని చేస్తుంది. అలాగే తక్కువ కేలరీలు ఉన్న ఆహరం తీసుకుంటే సులువుగా బరువు తగ్గొచ్చు. అయితే ఈ పుట్టగొడుగుల్లో అధిక మొత్తంలో ఫైబర్, చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీని కారణంగా జీర్ణక్రియ సక్రమంగా జరగడంతో పాటు ఆకలిని చాలా సేపు నియంత్రించుకోవచ్చు. క్రమంగా బరువు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అలాగే పుట్టగొడుగుల్లో ప్రోటీన్ కంటెంట్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కండరాల బలానికి, వాటి పెరుగుదలకు ఉపయోగపడతాయి.
క్యాన్సర్ నివారణకు..
పుట్టగొడుగుల్లో యాంటీ యాక్సిడెంట్లతో పాటు పాలీశాకరైడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. దీని ద్వారా మనం క్యాన్సన్‌ను జయించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే షిటేక్, రీషి వంటి పుట్టగొడుల్లో క్యాన్సర్‌ను అడ్డుకునే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు పలు పరిశోధనల్లో తేలింది కూడా. రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నవారు ఈ పుట్టగొడుగులను తినడం ద్వారా మంచి ఫలితాలను పొందొచ్చు.
వీటిని రోజు వారీగా డైట్‌లో చేర్చుకోవడం వల్ల.. పైన పేర్కొనబడిన ప్రయోజనాలతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయి. వాటిలో ముఖ్యమైనవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెదడును చురుగ్గా ఉంచుకోవచ్చు. అలాగే కండరాల బలహీనతను నివారించుకోవచ్చు. అయితే పుట్టగొడుగుల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన విషయం. మంచి ప్రయోజనాలు ఉన్న పుట్టగొడుగులు ఎంచుకుంటేనే మంచి ఫలితాలను పొందగలం.