అసలు గురించి నేటి తెలంగాణలో మాట్లాడే గొంతుల్ని వినబడనీయడం లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల ప్రచార హోరులో ఆ సన్నటి గొంతుకలు కప్పివేయబడుతున్నాయి. ఆర్భాటాలు, పటాటోపాలు మెండుగా చేయగలిగే వారికే ప్రాధాన్యత లభిస్తోంది. బూర్జువా మీడియా కథనాలు కూడా ఆ ప్రచారార్భాటంలో మునిగితేలుతున్నాయి. దానికి వంత పాడుతున్నాయి. వాటి చుట్టూనే ప్ర’దక్షిణా’లు చేస్తున్నాయి.
ముంజేతి కంకణానికి అద్దమెందుకన్నట్టు, ఈ వారంలో, మరీ ప్రత్యేకంగా మొన్న 12న లగచర్ల ఘటన తర్వాత మీడియాలో చర్చంతా కేటీఆర్ అరెస్టు అవుతాడా? కాడా? పట్నం నరేందర్‌రెడ్డికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఆయనేనా? సీన్లోలేని నరేందర్‌రెడ్డి హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో ఉదయం వాకింగ్ చేసుకుంటూంటే అరెస్టు చేయడం ఏం న్యాయం? ఇది ఒక చర్చకాగా, రైతుల కోసం తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమని కేటీఆర్ వీరంగం వేస్తున్నారు. మహా అయితే (జైల్లో ‘చిప్పకూడు’ తినిగా వచ్చు) స్లిమ్‌గా బయటికి వస్తారట. మీడియాలో చక్కర్లు కొడ్తున్న విశేషాలివి.
కాని అక్కడ ‘అసలు’ సమస్య రేవంత్‌రెడ్డి బ్రదర్స్ కాదు. కేటీఆరో, నరేందర్ రెడ్డో కూడా కాదు. ఫార్మాసిటీ! ‘అసలు’ సమస్య, మూడు గ్రామాలు లగచర్ల, హకీంపేట, పోలేపల్లి + రెండు తండాలకి చెందిన 1,274 ఎకరాల 25 గుంటల భూమికి సంబంధించినది. దీని గురించి మాట్లాడుతున్నవారెవరూ? ‘ఫార్మా సిటీ’ అనే పేరు చూడ్డానికి ‘స్టయిల్’గా ఉన్నా, దాని వల్ల వచ్చే జల, వాయు, పర్యావరణ కాలుష్యమెంత? దానిపై ‘అసలు’ చర్చే లేదు. ఈ ‘అసలు’ సమస్యలు ప్రధాన మీడియాలో కనపడవు, వినపడవు. ఈ మీడియా మాయాజాల మెంతుందంటే లగచర్ల ఫేమస్ అయినంతగా ఆ ఒక్క గ్రామంలోనే 560 ఎకరాలు ప్రభుత్వ సేకరణ చిట్టాలో ఉందనే విషయం రోజూ పత్రికలు చదివే వారికి సైతం తెలియని విషయం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములకు రెక్కలొచ్చి ఆకాశంలో ఎగరబట్టి చాలాకాలం అయింది. సాధారణ ప్రజల నుండి అమాయక గిరిజన రైతుల వరకూ ఈ విషయం తెలిసినదే.
ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాల అనుభవం చూసినా, దీనికి ఉత్తర దిక్కునున్న సంగారెడ్డి జిల్లా ‘నిమ్జ్’ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్)ను చూసినా, దక్షిణానున్న జడ్చర్లలో 964 ఎకరాల్లోని సెజ్ చూసినా సేకరించిన భూమికి, దాన్లో వెలిసే కంపెనీలకు, వచ్చే ఉపాధికీ అసలు పొంతనే లేదు. రైతులకున్న భూములు పోతున్నాయి. ఉద్యోగాలు దొరకడం లేదు. దొరికినా అన్‌స్కిల్డ్ లేబర్ పనులు, అదీ కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటున్నాయి. పైగా కాలుష్యాన్ని కొనితెచ్చు కుంటున్నారు. ఇవన్నీ ‘అసలు’ సమస్యలు. వీటిపై ప్రధాన మీడియాలో చర్చేలేదు. కనీసం కొందరు వామపక్ష మేధావులు మాట్లాడే ఉపన్యాసాల కవరేజి కూడా ఇవ్వట్లేదు.
రాష్ట్రంలో లక్షలాది రైతులకి సంబంధించిన రుణమాఫీ సమస్య అలానే ఉంది. 20 లక్షల మందికి 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రభుత్వం చెప్తున్నట్లే ఇంకో ఇరవై లక్షల మందికి 13 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఖరీఫ్ అయిపోయింది. రబీ సీజన్ ప్రారంభమవుతోంది. ‘రైతు భరోసా’ ఎకరానికి రూ.7,500 చొప్పున ఇస్తానన్నది ఇవ్వలేకపోతున్నారు. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో ఈ పరిస్థితి వల్ల రైతాంగం తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నది. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీపై ప్రభావం చూపుతుంది.
మొత్తం మీద ప్రజల కష్టాలు ఎన్నోరెట్లు పెరిగాయి. పిల్లల చదువులకి, వైద్యానికి అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తున్నది. నేటి సమాజంలో బహుశా అప్పులేని వారు దాదాపు ఉండరు. రైతాంగం మరీ అప్పుల్లో కూరుకుపోతున్నది. ఈ దశలో ఉన్న కాస్త భూమినైనా చేజారిపోకుండా చూసుకునేందుకు చాలా సందర్భాల్లో తెగించి పోరాడు తున్నారు. ఆ విషయం గమనించకుండా అంతా ప్రాయోజిత కార్యక్రమమేనని ప్రభుత్వ పెద్దలు కొట్టిపారేయడం తగదు. సుమారు 1,300 ఎకరాల భూమిని ఫార్మాసిటీ మింగేయడం నిజమైన సమస్య. దాన్ని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. ఫ్యాక్టరీలు రావద్దని ఎవరూ చెప్పరు. దానికి సేకరించాల్సిన భూమి ఏ తరహాది? రెండు పంటలు పండే భూమిని ఎట్టి పరిస్థితుల్లో సేకరించరాదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలి వంటి విషయాలపై రైతులను ఒప్పించుకుని ముందుకు సాగడమే ఉత్తమ మార్గం. అదే సమయంలో ఫార్మా కర్మాగారాలవల్ల ఏర్పడే జల, వాయు కాలుష్యాలు ప్రజల జీవించే హక్కులకే గొడ్డలిపెట్టు. దీనికి పరిష్కారమేమిటో ప్రభుత్వమే చెప్పాలి. వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించిన పై అంశాలన్నీ పరిగణనలోకి తీసుకునే రేవంత్ సర్కార్ ముందుకుసాగాలి. చివరిగా ఒక విషయాన్ని గుర్తించాలి. ‘అసలు’ సమస్యలు ప్రజల జీవితాలతో పెనవేసుకున్నవి. ఏరుదాటారు కాబట్టి వాటి గురించి ప్రభుత్వ పెద్దలు మాట్లాడకపోవడం అన్యాయం. దాన్ని మీడియాలో ఎక్స్‌పోజ్ చేయకపోవడం అనైతికం.