డిసెంబర్ నెల ప్రారంభమయ్యిందంటే చాలు క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి. ఇంటిపైన స్టార్ వెలిగించడం, ఇంటి ముందు క్ర్రిస్మస్ ట్రీని పెట్టడం వంటివి చేస్తారు. దీనిని అందంగా అలంకరించి కొవ్వొత్తులు వెలిగిస్తారు. దీనికి కారణమేమిటో ఒకసారి పరిశీలిద్దాం..
సాధారణంగా క్రిస్మస్ చెట్లను ఏర్పాటు చేసుకొని అందంగా అలంకరించుకోవాలన్న ప్రతిపాదన ఏదీ లేదట. కొన్ని వందల ఏండ్ల క్రితం ‘జనరల్ ఫెడరిక్ అడాల్ఫ్ రెడిజిల్’ అనే వ్యక్తి సైనికులకు ఇచ్చిన విందులో సైనికులను అబ్బుర పరిచేందుకు ఈ చెట్లను వినియోగించారట. ఆ చెట్లను డెకరేట్ చేయడంతో అది ప్రాచుర్యం పొందింది.
అలాగే 18వ శాతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజ భవనంలో క్రిస్మస్ వేడుకలో ఈ క్రిస్మస్ చెట్టును అలంకరించారు. దీంతో ఈ సంప్రదాయం ప్రపంచ దేశాలకు విస్తరించింది. రష్యా, ఆస్ట్రేలియా వంటి తదితర దేశాలకు కూడా ఈ సంప్రదాయం పాకింది. అప్పటి నుంచి క్రిస్మస్ వస్తే ఇంటిపైన స్టార్ వెలిగించడం, ఇంటి ముందు క్రిస్మస్ చెట్టు పెట్టుకోవటం పరిపాటిగా మారింది.
ఎందుకు పెడతారంటే?
క్రిస్మస్ చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని దేశాలన్నీ పరిగణిస్తుంటాయి. ఈ చెట్టుకు ఇవ్వడం మినహా తీసుకోవడం వంటివి తెలియదని చెబుతుంటారు. అందుకే ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని లంకరించుకుంటారు.
అలాగే ఇంటిపై స్టార్‌ను క్రీస్తు జన్మ నక్షత్రమని క్రైస్తవులు చెబుతుంటారు. క్రీస్తు ఈ భూమి మీదకు వస్తున్నారని చెబుతూ, అలాగే రావాలని కాంక్షిస్తూ ఇళ్లపై ఈ స్టార్లను అలంకరిస్తూ ఉంటారు. కొన్ని వందల ఏండ్ల కిందట ప్రారంభమైన ఈ ఆచారాలు నేటికీ కొనసాగుతున్నాయి.
క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారంటే?
డిసెంబర్ 25న యావత్ ప్రపంచం క్రిస్మస్ జరుపుకుంటుంటుంది. మన దేశంలోని క్రైస్తవులతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. కొన్ని వేల ఏండ్ల క్రితం మేరీ, జోసెఫ్ దంపతులకు డిసెంబర్ 24వ తేదీన యేసు జన్మించారు. మేరీ కన్యగా ఉన్నప్పుడే దేవదూతలు ఆమెకు యేసును ప్రసాదిస్తారు. అలా ఆమె డిసెంబర్ 24వ తేదీ అర్థరాత్రి యేసుకు జన్మనిస్తుంది. యేసు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ జరుపుకుంటారు.