రాష్ట్రంలో విస్తారంగా వాన

– 331 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
– హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
– వచ్చే మూడ్రోజులు వానలు పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఆదివారం ఉదయం 8 :30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 331 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబీల్‌పురలో అత్యధికంగా 7.18 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు.