ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఏబీవీపీ దాడి

– పలువురికి గాయాలు
– అసభ్య పదజాలంతో దూషణ
– మొన్న సంగారెడ్డిలో..
– నిన్న కరీంనగర్‌లో..
నవతెలంగాణ – కరీంనగర్‌
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఫ్లీనరీ సమావేశాలను పురస్కరించుకుని గురువారం రాత్రి సంగారెడ్డి తోరణాలు కడుతున్న కార్యకర్తలపై ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఏబీవీపీ గూండాలు అసభ్యపదజాలంతో దూషిస్తూ మళ్లీ దాడికి తెగబడ్డారు.ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను పురస్కరించుకుని సంగారెడ్డిలో గురువారం రాత్రి ఏర్పాట్లలో ఉన్న కార్యకర్తలపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారు. కర్రలతో వచ్చి దాడి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రమేష్‌, శ్రీకాంత్‌పై అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంలో మకాం వేసిన ఏబీవీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారని తెలుసోంది. కాగా, దాడిపై శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో నిరసన చేపట్టారు. అక్కడకు చేరుకున్న ఏబీవీపీ నాయకులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడిచేశారు. అమ్మాయిలు అని చూడకుండా వారిని సైతం నెట్టేశారు. అంతటితో అగకుండా జిల్లా కార్యదర్శి శ్రీకాంత్‌పై భౌతికదాడికి దిగారు. ఆయన తలకు తీవ్ర రక్తసావ్రం కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ ఘటనపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా తమపై దాడి చేశారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులుపై ఏబీవీపీ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు.
ఎదుర్కోలేకనే దాడులు
సైద్ధాంతికంగా ఎదుర్కొనే శక్తి లేకనే ఏబీవీపీ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు సాను, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూర్తి, నాగరాజు, ఉపాధ్యక్షులు తాటికొండ రవి, సహాయ కార్యదర్శి మిశ్రీనా సుల్తానా అన్నారు. సంగారెడ్డిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను చూసి ఓర్వలేక ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నల్లవల్లి రమేష్‌, శ్రీకాంత్‌పై దాడులు చేసి తలలు పగులగొట్టారన్నారు. దాడులతో పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు. దాడి చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. గాయపడిన రమేష్‌ మాట్లాడుతూ.. దాడులకు దడిసే సంఘం ఎస్‌ఎఫ్‌ఐ కాదన్నారు.