హెచ్‌సీయూలో అకడమిక్‌ వాతావరణాన్ని ఏబీవీపీ విచ్ఛిన్నం

Academic at HCU ABVP breaks the atmosphere– మద్యం మత్తులో విద్యార్థులపై దాడి..
– ఎస్‌ఎఫ్‌ఐ దాడిచేసినట్టు చిత్రీకరణ
– పోలీసులు నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి
– తక్షణమే అడ్మినిస్ట్రేషన్‌ స్పందించి దోషులను రస్టీకేట్‌ చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్‌.ఎల్‌.మూర్తి, టి.నాగరాజు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
ఏబీవీపీ నాయకులు హెచ్‌సీయూలో అకడమిక్‌ వాతావరణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, మద్యం మత్తులో విద్యార్థులపై దాడి చేసి, గాయాలు చేసుకొని ఎస్‌ఎఫ్‌ఐ దాడిచేసినట్టు చిత్రీకరిస్తున్నారని, పోలీసులు నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.ఎల్‌.మూర్తి, టి.నాగరాజు డిమాండ్‌ చేశారు. భారత విద్యార్ధి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ దాడిలో గాయపడిన విద్యార్ధులు మెహిత్‌, ఆషిక, ఖాయినీ, ఫైజల్‌తో వారు పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్‌ 13న ఎకనామిక్స్‌ డిపార్టుమెంట్స్‌ ఫెర్వెల్‌ పార్టీ జరుగుతున్న సందర్భంలో ఏబీవీపీకి చెందిన కొందరు మద్యం మత్తులో అల్లరి చేస్తూ పాటల విషయంలో గొడవ చేస్తుంటే విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో వికలాంగుడైన స్కాలర్‌పై అకారణంగా దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారనే అక్కసుతో తిరిగి 17వ తేదీన తన రూమ్‌లోకి వెళ్తున్న ఫైజల్‌ అనే విద్యార్ధిపై విచక్షణా రహితంగా దాడి చేసి, గొంతు నులిమి బెదిరింపు లకు పాల్పడ్డారని తెలిపారు. జేఎన్‌యూలో నబీబ్‌ అనే విద్యార్ధి అదృశ్యమైన ఘటనను గుర్తుచేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏబీవీపీ నాయకులు విద్యార్ధులను బెదిరింపులకు గురి చేయటం, జే హాస్టల్స్‌ దగ్గర దాడి చేస్తుంటే అడ్డుకున్న ఇతర విద్యార్ధులపై కూడా మద్యం సేవించి హాకీ స్టీక్స్‌తో దాడి చేయటం, అమ్మాయిలు దాడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని లైంగిక వేధింపులకు గురిచేయడం లాంటి ఘటనలు యూనివర్సిటీలో చోటుచేసుకుంటున్నాయన్నారు. ఈ దాడిలో 10 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా.. వారు సరిగ్గా విచారణ చేయకుండా రెండు గ్రూపుల మధ్య ఘర్షణగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరిపై కేసులు అంటూ బైండోవర్స్‌ చేస్తున్నారని, పోలీసులు ఈ ఘటనలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కొన్నేండ్లుగా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐని ఎన్నికల్లో విద్యార్థులు గెలిపిస్తూ ఆదరిస్తున్నారనే అక్కసుతో సాధారణ విద్యార్థులపై ఏబీవీపీ వాళ్లు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏబీవీపీ వాళ్లను యూనివర్సిటీ అధికారులు హెచ్చరించి వారిని యూనివర్సిటీ నుంచి రస్టీకేట్‌ చేయాలని, అప్పటివరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. ఏబీవీపీ చేస్తున్న ఈ చర్యలకు వ్యతిరేకంగా క్యాంపస్‌ను కాపాడుకునేందుకు విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు శివదుర్గారావు, హెచ్‌సీయూ విద్యార్ధి అధ్యక్షులు అతీక్‌, కార్యదర్శి కృపాజార్జ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జూనుగరి రమేష్‌, హైదరాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు స్టాలిన్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.