గోరఖ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ మూకల వీరంగం

– వీసీ, రిజిస్ట్రార్‌పై దాడి…పిడిగుద్దులు
– పోలీసుల పైనా తిరుగుబాటు
గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ఇలాకా గోరఖ్‌పూర్‌లో బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తలు శుక్రవారం బీభత్సం సృష్టిం చారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్‌ యూనివర్సిటీ లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైస్‌ ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌పై దాడి చేసి కొట్టారు. వారిని కింద పడేసి పిడిగుద్దులు గుద్దారు. అడ్డుకోబోయిన పోలీసులపై కూడా తిరగబడ్డారు. ఏబీవీపీ కార్యకర్తలు తొలుత వైస్‌ ఛాన్సలర్‌ ఛాంబర్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. వారిని నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైస్‌ ఛాన్సలర్‌ రాజేష్‌ సింగ్‌, రిజిస్ట్రార్‌ అజరు సింగ్‌, కొందరు పోలీసులు గాయపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థు లతో సమావేశమయ్యేందుకు వర్సిటీ అధికారులు నిరాకరిం చడంతో గొడవ మొదలైంది. సమస్యలు పరిష్కరిస్తామని గతంలో వైస్‌ ఛాన్సలర్‌ హామీ ఇచ్చారని, అయినా ఏమీ జరగలేదని విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీలో అలజడి సృష్టిస్తున్న నలుగురు ఏబీవీపీ కార్యకర్తలను అంతకుముందు డీన్‌ సత్యపాల్‌ సింగ్‌ సస్పెండ్‌ చేశారు. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి. నిరసనకారులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమ వడంతో పరిస్థితి మరింత క్షీణించింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు వర్సిటీ అధికారులను సురక్షిత ప్రదేశానికి తరలించారు.